తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దానిపై తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని.. తన వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని దిల్ రాజు కోరారు.
“నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. నిజామాబాద్ వాసిగా ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం రీత్యా అప్పట్లో ‘ఫిదా’ సక్సెస్ మీట్ పెట్టాను. ఈ క్రమంలోనే మన సంస్కృతిలో ఉండే దావత్, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని.. అవహేళన చేశానని కొందరు మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది.
నేను ఎవరినీ అవమానించాలనో.. అవహేళన చేయాలనో అనుకోలేదు. కేవలం ‘తెలంగాణ దావత్ మిస్సవుతున్నా.. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలనుకున్నా’ అని చెప్పడం నా ఉద్దేశం.
అదే విషయాన్ని ఈవెంట్‌లో చెప్పా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా నా మాటల వల్ల మనస్తాపం చెందితే క్షమించండి. సినీరంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఎదిగాను. ఎఫ్‌డీసీకి రాజకీయాలతో సంబంధం లేదు. అనవసర విషయాల్లోకి లాగొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా” అని దిల్ రాజు పేర్కొన్నారు.