- కొడంగల్‌లో తలపెట్టింది ఇండస్ట్రియల్ కారిడార్
- కాలుష్య రహిత కంపెనీలను నెలకొల్పుతాం
- లగచర్ల ఘటనలో కుట్రచేసినవారిని వదిలిపెట్టేది లేదు
- వామపక్ష నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): కొడంగల్‌లో ఏర్పాటుచేయ బోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. లగచర్ల ఘటనలో కుట్రచేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు.
శనివారం సచివాలయంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ), ఆర్‌ఎస్‌పీ, సీపీఐఎంల్ లిబరేషన్, ఇతర వామపక్ష నేతలు సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో జరిగిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, రైతులపై నిర్బంధకాండను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపును ఎత్తివేయాలని, బలవంతంగా భూసేకరణ చేయొద్దని, అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇలా తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు వామపక్ష నేతలు అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని.. తన నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకే తాను ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు వామపక్ష నేతలకు వివరించారు. అక్కడ ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని తేల్చి చెప్పారు.
తన సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడుతానని వివరించారు. కొడంగల్‌లో కాలుష్యరహిత పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని స్పష్టంచేశారు.
లగచర్ల ఘటనలో అమాయక రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని వామపక్ష నేతలకు సీఎం చెప్పారు. సీఎంను కలిసిన వారిలో సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. సీఎంను కలిసిన అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు.
నివేదికను అందజేశాం: తమ్మినేని
లగచర్లలో పర్యటించి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశాం. లగచర్లలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరాం. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. లగచర్లలో వరికోతకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. సీఎం వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌చేసి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. గ్రీన్ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం, కుట్రల కోసం లగచర్ల రైతులకు అన్యాయం చేయొద్దు. వామపక్షాల ఆధ్వర్యంలో మరోసారి లగచర్లలో పర్యటిస్తాం.
నిర్వాసితుల పాలసీని మార్చాలి: కూనంనేని
లగచర్ల ఘటనతో సంబంధం లేనివారిపై కేసులను ఎత్తివేయాలని కోరాం. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమి కావాలంటే.. సాగు భూములు కాకుండా, ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో భూమిని తీసుకున్నా.. పరిహారాన్ని పెంచాలని అడిగాం. నిర్వాసితుల పాలసీని మార్చాలి. ఈ అంశాలకు సీఎం సానుకూలంగా స్పందించారు.