calender_icon.png 21 February, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నీళ్లు స్నానానికి పనికిరావు

19-02-2025 01:10:06 AM

  1. ప్రయాగ్‌రాజ్ నదీ జలాల్లో పరిమితికి మించి కోలీఫామ్ బ్యాక్టీరియా
  2. ఎన్జీటీకి నివేదిక సమర్పించిన సీపీసీబీ
  3. మహాకుంభ్‌ను మృత్యు కుంభ్‌గా పేర్కొన్న మమతా బెనర్జీ

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 18: మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని గంగానది నీటిలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోవడం పట్ల జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది.

వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు ప్రదేశాల్లో జరిపిన పరీక్షల ద్వారా నది లో మల సంబంధిత కోలీఫామ్ బ్యాక్టీరియా పరిమితికి మించి పెరిగిపోవడంతో నదీ జలాల్లో సాన్నాలకు కావాల్సిన ప్రమాణాలు లేవనే విషయాన్ని గుర్తించినట్టు  ఎన్జీటీకి ఈ నెల 3న సమర్పించిన నివేదికలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) పేర్కొంది.

పెద్ద మొత్తం లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్.. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు  విఫలమైందని అసహనం వ్యక్తం చేసింది.

అలాగే యూపీపీసీబీ అధికారులు వర్చువల్‌గా ట్రిబ్యునల్ ముందు హాజరై.. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశి స్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

అది మృత్యు కుంభ్

మహాకుంభమేళాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మృత్యు కుంభ్‌గా అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన ఆమె.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాకుంభమేళాలో చేసిన ఏర్పాట్లపై ధ్వజమెత్తారు.

వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సాధారణ ప్రజల కోసం కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదని ఆరోపించారు. ‘మహా కుంభ్, పవిత్రమైన గంగామాతను నేను గౌరవిస్తాను. కానీ ఇది మృత్యు కుంభ్. సరైన ప్రణాళికలే లేవు.

ఎంత మందిని రక్షించారు? వీఐపీలు, ధనవంతుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. కానీ పేద ప్రజల కోసం కనీస సౌకర్యాలను కల్పించలేదు’ అని పేర్కొన్నారు. తొక్కిసలాటలు సర్వసాధారణమైనప్పటికీ వాటిని అరికట్టడానికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.