calender_icon.png 9 February, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పాట నా లైఫ్‌ను మార్చేసింది!

09-02-2025 12:00:00 AM

అన్నిమల్లె అనిల్ కుమార్.. ఒక జానపద కళాకారుడిగా.. ప్లే బ్యాక్ సింగర్‌గా, రచయితగా తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్నతనం నుంచి బైండ్ల కథలు, సురభి నాటకాలను చూస్తూ పెరిగారు.. పాటపై ఉన్న ప్రేమతో.. కన్నవారిని.. ఊన్న ఊరిని వదిలి నగరం బాట పట్టారు. అలా నగరం అనిల్ పాటకు వేదిక అయింది. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా.. కళామతల్లికి సేవ చేశాడు. జానపద కళాకారుడిగా ముఫ్పు ఏళ్ల కళా ప్రస్థానాన్ని ఖజానాతో పంచుకున్నారిలా.. 

మాది సిద్దిపేట. నా బాల్యం, చదువువంతా అక్కడే. చిన్నప్పటి నుంచి సురభి నాటకాలు, జానపద గేయాలు చూస్తూ పెరిగా.. వాటిపై నాకు ఎక్కువ ఆసక్తి ఉండేది.  పాట మీద మక్కువతో హైదరాబాద్ వచ్చా. వచ్చి ఇప్పటికీ ముప్పు ఏండ్లు అవుతుంది. ముఫ్పు ఏండ్ల నుంచి పాటతోనే నా ప్రయాణం సాగుతున్నది.

అందరికి అనిల్ కుమార్‌గా పరిచయం కానీ, మా అమ్మనాన్న పెట్టిన పేరు బిక్షపతి. ఈ పేరు పిలవడానికి ఇబ్బందిగా ఉందని.. కాలేజీలో మా ఫ్రెండ్ దినేష్ అనిల్ కుమార్ అని పేరు పెట్టారు. కాలేజీ రోజుల్లోనే మేం ఒక ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకున్నాం.

అలా పాట కోసం, పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చా.. హైదరాబాద్ వచ్చాక యాక్టింగ్ చేయడం పట్ల ఆసక్తి పుట్టి వర్క్‌షాప్‌లో చేరా.. ఆ వర్క్‌షాప్‌లో ధన్‌రాజ్, ఉత్తేజ్ పరిచయం అయ్యారు. వారి ద్వారా డైరెక్టర్ కృష్ణవంశీ ‘మహాత్మ’ సినిమాలో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. ఆ పాట ద్వారా ఒక గుర్తింపు వచ్చింది. 

ఉద్యమ గేయం.. 

హైదరాబాద్ వచ్చిన కొత్తలో వరంగల్ శంకరన్న, సారంగపాణి అన్నతో కలిసి పనిచేశాను. వారి ద్వారా కొంచెం ఎక్కువ జానపదాలు పాడటం అలవాటైంది. సిద్దిపేటలో ఉన్నప్పుడు లక్ష్మణ్, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ అన్న ఇలా అందరం ఒక్కటే హైస్కూల్లో చదివాం. లక్కీగా రసమయి బాలకిషన్ అన్న, నేను చదువుకునే రోజుల్లో ఒకే గదిలో ఉండేవాళ్లం.

ఇంకో మిత్రుడు బీకనకయ్య అని ఉండే.. ఇప్పుడు ఆయన కలెక్టర్ అయ్యాడు. అలా పాటలకు సంబంధించిన గ్రూప్ ఉండేది మాకు. యు వజన శాఖ ద్వారా యూత్ ఫెస్టివల్స్ జరుపుకునేది. చాలా స్టేజీల్లో.. సభల్లో పాటలు పాడాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఒక పాట రాశాను. ఉద్యమ సమయంలో ఊత పదాలతో అప్పటికప్పుడు పాటను అల్లుకునేది.

ఉద్యమంలో మమ్మల్ని గుర్తించి కేసీఆర్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో మాకు అవకాశం ఇచ్చారు. ఎందరో నాలాంటి కళాకారులకు ఉపాధి కాల్పించారు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ యాది పెట్టుకుంటాం. అయితే మహాత్మ సినిమాలో  పాటకు మంచి గుర్తింపు, పేరు రావడంతో మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ నన్ను పిలిపించుకుని

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్ట సినిమాలో చిత్రగారితో కలిసి పాడే అవకాశం కల్పించారు. జాతీయస్థాయిలో రెండుసార్లు ప్రదర్శనలు ఇచ్చా.. ఐతే ప్రభుత్వం తరపున పాల్గొన్నందుకుగాను ఒక అవార్డు ఇచ్చారు.

అలాగే ‘రంగ శాల’ అని ఢిల్లీలో నిర్వహించేది. దీనికి అన్నీ రాష్ట్రాల నుంచి వచ్చిన సింగర్స్‌కు పోటీలు నిర్వహించారు. దాంట్లో నాకు అవార్డు రావడం జరిగింది. అది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకున్నా. 

సినిమా పాటల్లో.. 

సినిమా పాటల్లో ఫోక్ సాంగ్స్‌కు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఒక్క పాట పాడితే.. చాలు అందుబాటులో ఉండరు. యూట్యూబ్‌లో సక్సెస్ అయినవాళ్లు.. వేదికలపై సక్సెస్ కావడం చాలా తక్కువ. ఎందుకంటే వేదికలపై డైరెక్టుగా పాడాల్సిందే. సామాజిక చైతన్యం కోసం ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాను. సినిమాల్లో కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. 

ఆ పాట పెద్ద హిట్.. 

‘నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి’ ఈ పాట పెద్ద హిట్ కావడంతో అప్పటిన్నుంచి నన్ను నీలపురి గాజుల అనిల్ అన్న పిలవడం మొదలెట్టారు. పాటలు పాడటానికి ప్రధాన కారణం. మా కుటుంబ నేపథ్యం  మానాన్న వృత్తి బైండ్ల కథలను చెప్పడం. దాంతోపాటు ఎల్లమ్మ, దుర్గమ్మ, పోచమ్మ కథలు చెప్పేది.

బడికి వెళ్లొచ్చిన తర్వాత వాళ్ల వెంటే వెళ్లేది. వాళ్లు జమిడికం, తాళాలు కొడుతూ అమ్మవార్లను కొలిచేది. అది చూస్తూ పెరిగాను.. హైదరాబాద్ వచ్చాక జానపదాలకు, సినిమా పాటలకు అవకాశం రావడంతో కులవృత్తికి కొంచెం దూరమయ్యా. ఇప్పటికీ మా తమ్ముళ్లు, బాబాయ్‌లు అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. సమయం దొరికితే వెళ్తాను.