ఏడు మండలాలను కలిపింది బీఆర్‌ఎస్, బీజేపీలే
విభజన చట్టంలో వాటి ప్రస్తావనే లేదు
పదేళ్ల అధికారంలో బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు
ఇప్పుడు వాటికోసం కేసీఆర్ దీక్ష చేయాలి
రైతు భరోసాలో సీలింగ్ ప్రచారం అవాస్తవం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో కలవడానికి బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావన లేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో తెలంగాణకు చెందిన వీటిని ఏపీలో కలిపారని తెలిపారు. ఈ మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఈ విషయంలో ప్రతిపక్ష నేతగా తాను అప్పుడే వ్యతిరేకించానని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కలిసి మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీలో 7 మండలాల ప్రస్తావన తీసుకురావాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి విభజన చట్టంలోని అంశాలతో పాటు, ఏపీకి కేటాయించిన 7 మండలాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ మండలాల కోసం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు దీక్ష చేయాలని భట్టి డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన్ను వెంటాడుతున్నాయన్నారు.
విభజన చట్టంలోని అంశాలన్నింటిపైనా ముఖ్యమం త్రుల సమావేశంలో చర్చకు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి గురు శిష్యులు కాదని, సహచరులని తెలిపారు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్పారని గుర్తుచేశారు. రైతు భరోసాకు 5 ఎకరాల వరకే సీలింగ్ ఉంటుం దని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భట్టి స్పష్టం చేశారు. ప్రజాధనంలో ఒక్క పైసా దుర్వినియోగం కాకూడదనే తమ ప్రభుత్వ నిర్ణయమని, పెట్టుబడి సాయం అర్హులైన రైతులకే అందాలన్నారు. వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు.
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్‌పై కసరత్తు
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని, పీసీసీ నూతన చీఫ్ విషయంలోనూ కసరత్తు జరుగుతోందని భట్టి తెలిపారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లేనని కొట్టిపారేశారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, పుట్టింది బతకడానికని, చావడానికి కాదనే విషయం ఆర్థం చేసుకోవాలన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రను సహించలేకనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సారు.. కారు.. 16 నుంచి జీరోకు వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. ఏపీ సీఎస్‌గా చేసిన ఆదిత్యనాథ్‌దాస్ ఇరిగేషన్ శాఖలో మంచి నిపుణులని, అందుకే ఆయన్ను సలహాదారుగా పెట్టుకున్నామన్నారు. ఆయన తమ అంచనాలను అందుకోలేకపోతే పక్కన పెడుతామని పేర్కొన్నారు.
రైతు భరోసాపై..
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని భటి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షల వరకు పెంపు తదితర వాటిని అమలు చేస్తున్నామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. హామీలు అమలు కావద్దని కొందరు భావిస్తున్నారని, గతంలో రూ.లక్ష వరకు కూడా రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రైతు భరోసాపై వేసిన సబ్‌కమిటీ నాలుగు గోడల మధ్య కూర్చొని విధివిధానాలు రూపొందించదని, ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాల నుంచి అభిప్రాయం తీసుకుంటుందన్నారు. రైతులు ట్యాక్స్ పేయర్స్, మీడియా, మేధావులతో మాట్లాడి అభిప్రాయలు సేకరిస్తామన్నారు. ఈ 15 వరకు కమిటీ నివేదిక ఇస్తుందని, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడుతామన్నారు. ప్రజలు కోరుకుంటే కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇస్తామని, ఏదైనా ప్రజల నిర్ణయమేనని అన్నారు.