calender_icon.png 20 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సీన్ దర్శకుడి నిర్ణయమే..

20-01-2025 12:10:25 AM

రవితేజ హీరోగా వచ్చిన ‘శంభో శివ శంభో’ చిత్రంలో పవిత్రగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అభినయ. ఇటీవల ఈమె నటించిన ‘పని’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఉంది. జోజూ జార్జ్ తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌పై అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. ఓ ఇంటర్వ్యూలో అభినయ ఈ సన్నివేశంపై స్పందించారు.

పుట్టుక తోనే మూగ, చెవుడు సమస్య కలిగి ఉన్న ఆమె సైన్ లాంగ్వేజ్‌తో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘తన సినిమాలో ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి? ఎలా తెరకెక్కించాలి? అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయమే. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏమీ మాట్లాడాలనుకోవటం లేదు. ఏది ఏమైనా దర్శకుడి మాటే తుది నిర్ణయం.

వివిధ భాషల్లో ఎంతో మంది పేరున్న దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవజ్ఞుడైన జోజూ గొప్ప నటుడు. షూటింగ్ టైమ్‌లో నాకు ఎంతో సహాయం చేశారు. యాక్టింగ్ గురించి సలహాలు ఇచ్చేవారు. ఆయనతో పనిచేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.

ఈ సినిమాతో అది నెరవేరింది. మిగతా భాషలతో పోల్చితే మలయాళంలో నటించడం కాస్త భిన్నమైన అనుభూతినిచ్చింది. మలయాళ నటుడు టొవినో థామస్ నటనంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది. డైరెక్టర్లలో రాజమౌళి అంటే అభిమానం. ఆయన సినిమాలో ఒక్కసారైనా నటించాలనేది నా కల” అని చెప్పారు అభినయ.