* మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఘాటు వ్యాఖ్యలు
* నోటీసులు జారీ.. ఎఫ్‌ఐఆర్ నమోదు
మేడ్చల్, జనవరి 4 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో జరిగిన ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని గుర్తించి అందుకు తగిన చర్యలు తీసుకోడానికి సమాయాత్తమవుతోంది.
మెస్‌లో పనిచేసే సిబ్బంది బాలికల హాస్టల్ బాత్ రూం వెంటిలేటర్ వద్ద తిరిగినట్లు నీడ కనిపించిందని, వీడియోలు తీశారని విద్యార్థినులు రెండు రోజులు ఆందోళన చేసిన విషయం విధితమే. ఆ సమయంలోనే మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ రమణి కాలేజీకి వచ్చి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
కాలేజీ యాజ భు షోకాజు నోటీసు కూడా అందజేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. తాజాగా చైర్‌పర్సన్ ఈ విషయమై ఘాటుగా స్పందించారు. తిరుపతి పర్యటలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు కాలేజీ యాజమాన్యానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
పూలమ్మిన, పాలమ్మిన అని డైలాగులు చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి అశ్లీల వీడియోలు అమ్ముకుంటారా అని సమాజం ప్రశ్నిస్తోందన్నారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు నడుపుతున్నపుడు విద్యార్థులు ఏమి తింటున్నారు, ఎలా ఉన్నారని తెలుసుకునే బాధ్యత యాజమాన్యానికి లేదా అని ప్రశ్నించారు.
మూడు నెలల నుంచి విద్యార్థినులు చెబుతుంటే వారిపైనే దుర్భాషలాడటం సరైందికాదన్నారు. మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ నోటీసు ఇచ్చినందున యాజమాన్యం విచారణకు రావలసిందేనని ఆమె స్పష్టం చేశారు. తాను కూడా కాలేజీ సందర్శిస్తానని, విద్యార్థినులతో మాట్లాడుతానని చెప్పారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు
సీఎంఆర్ కాలేజీ ఘటనకు సంబంధించి విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లు లేవు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. వార్డెన్ ప్రీతిరెడ్డి, మెస్ ఇన్‌చార్జి, ఐదుగురు బీహార్ వర్కర్‌లను విచారించారు. వారి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వేలి ముద్రలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
చిక్కుల్లో మల్లారెడ్డి
ఈ ఘటనతో మాజీ మంత్రి మల్లారెడ్డి చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. పదేళ్లు అధికార పార్టీలో ఉన్న మల్లారెడ్డి తన విద్యాసంస్థల్లో ఏమి జరిగినా బయటకు రానీయలేదు. మల్లారెడ్డికి యూనివర్సిటీతో పాటు సీఎంఆర్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయి.
హాస్టళ్లలో ఆహారం సరిగా లేదని అనేకసార్లు విద్యార్థులు ధర్నాలు చేసినప్పటికీ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. విద్యాసంస్థలలో, హాస్టళ్లలో అనేక లోపాలున్నాయి. కాంగెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఆ పార్టీలో నాయకులతో మల్లారెడ్డికి వైరం ఉన్నందున ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.