- సంపద సంరక్షణకు నిలయం చారిత్రక నిర్మల్ చెరువు
- చెరువులోనే కోటలు, ఆలయం, శ్మశాన వాటిక నిర్మాణం
- నీటిలో నుంచే రాతి సొరంగ మార్గాలు ఏర్పాటు
- శత్రువుల నుంచి రక్షణకు మొసళ్లు
నిర్మల్, జనవరి ౧౧ (విజయక్రాంతి): నిర్మల్ పేరు వింటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొయ్యబొమ్మలు, నిర్మల్ పేయింట్ కోటలు గుర్తుకొస్తాయి. కానీ, నిర్మల్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మరో అంశం కూడా ఉంది. అదే నిర్మల్ ఖజాన చెరువు. పూర్వకాలంలో ఈ చెరువు రాజులకు ఖజానాగా విలసిల్లేదట.
నాడు రాజులు తమ సంపద రక్షణకు చెరువులో ప్రత్యేకంగా ఓ బావిని తవ్వించి అందులో ధనం, నగలు, వజ్ర, వైడూర్యాలు, ఆయుధాలను కూడా దాచిపెట్టేవారని ప్రతీతి. ౧౭వ శతాబ్దంలో నిర్మల్‌ను పాలించిన నిమ్మలనాయుడు ఆ ప్రాంతం చుట్టూ గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ తర్వాత అతని కుమారుడు వెంకటాద్రి నాయుడు ౩౦ ఏండ్లు నిర్మల్‌ను ఏలాడు.
ప్రస్తుతం నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట్‌ను కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన చేశాడు. అప్పట్లో ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తులు, యుద్ధాల ద్వారా లభించిన ధనం, వజ్ర వైడూర్యాలు, బంగారం, ఆయుధ సంపదకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వెంకటాద్రి పేట ఎత్తయిన కొండపై కోట నిర్మించారు. పెద్ద పెద్ద బండరాళ్లు, బంక సున్నం, బురుజులు, సొరంగ మార్గంతో కోట నిర్మించుకోని పరిపాలన చేసినట్టు చరిత్ర చెప్తోంది.
ఖజానా చెరువు ప్రత్యేకతలెన్నో
వెంకటాద్రిపురం కేంద్రంగా పాలన సాగించిన వెంకటాద్రి నాయుడు తన రాజ్య సంపదను దాచేందుకు నిర్మల్ చెరువును ఎంచుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా చెరువులో బావి తవ్వించాడు. ఆ బావిలో సంపదను దాయడంతో ఈ చెరువకు ఖజానా చెరువుగా పేరొచ్చింది. నాడు నిర్మల్ చుట్టూ నిర్మించిన ౧౧ గొలుసుకట్టు చెరువుల్లో అత్యంత లోతున్న చెరువు ఖజానా చెరువు.
రాజు కోటను ఆనుకొని ఈ చెరువు తవ్వించారు. రాజు పూజలు చేసుకోవడానికి ఈ చెరువు మధ్యలోనే ఆలయం నిర్మించారు. కోట నుంచి ఆలయం వరకు రాతి కట్టడంతో దారి ఏర్పాటు చేశారు. రాతిశిలలతో ఓంకారనాథం వినిపించేలా నిర్మించిన ఈ ఆలయం ఓంకారేశ్వర ఆలయంగా పేరుగాంచింది. ఇప్పటికి ప్రజలచేత పూజలు అందుకొంటున్నది.
దీనికి ఎదురుగా ఈ చెరువులో దక్షిణ భాగాన ఒక బావిని తవ్వించారు. తరువాత కాలంలో ఈ బావి రాజుల సంపదను దాచిపెట్టె ఖజానాగా మారింది. యుద్ధాలు జరిగినపుడు శత్రవులకు రాజ్య సంపద దొరుకకుండా మందు జాగ్రత్త, దూరదృష్టివో ఈ చెరువును వినియోగించుకున్నట్టు పూర్వీకులు చెప్తుంటారు. పెద్ద బండ రాళ్లు, సున్నం, భారీ రాతి పలుకులులతో నీటి లోపల రహస్య గదులను నిర్మించారు.
35 ఎరారాల విస్తీర్ణంలో 5ం అడుగుల లోతులో దీన్ని నిర్మించారు. చెరువు లోతుగా ఉండటంతో 365 రోజులు బావి చుట్టూ నీరుండేలా రక్షణ గోడ నిర్మించారు. నీటి పరిమాణం తగ్గితే పక్కనే ఉన్న బంగల్‌పేట్ చెరువు నుంచి ఇందులోని నీళ్లను మళ్లించేలా భూగర్భంలోనే రాతి కాలువను నిర్మించారు.
నీళ్ళు అధికంగా ఉన్నప్పుడు రాజు దాచిన సంపద తీసుకెళ్లడానికి వీలుగా నైరుతి భాగంలో ఉన్న బురుజు నుంచి బావి వరకు నాలుగు వైపుల రాతి కట్టడాల సొరంగ మార్గాలను సైతం ఏర్పాటు చేయడం విశేషం. సంపదను బావి వరకు ఎలా చేర్చాలో తెలిపే బోర్డులను సైతం రాతి గోడలపై ఏర్పాటుచేశారు.
అవి శత్రువుకు కనిపించకుండా రాతితో కప్పి ఉంచారు. కోట పైనుంచి ఎటుచూసినా ౧౫ కిలోమీటర్ల వరకు కనిపించడంతో శత్రువులు వస్తే సైన్యం అప్రమత్తం అయ్యేది. సంపద రక్షణకు గొలుసుల సాయంతో మొసళ్లను కట్టి నీటి అంచున ఉంచేవారట. ఒకవేళ శత్రవులు కోటపైకి గాని, ధనబాంఢాగారంపై గానీ దండెత్తినపుడు మొసళ్లను చెరువులో వదిలేవారట.
ఇలా శత్రువుల చేతికి సంపద చిక్కకుండా రక్షణ చర్యలు చేపట్టడం విశేషం. చెరువులోనే ఓంకారేశ్వర ఆలయం ఉండటంతో పరమశివుడు ఖజానాకు కాపాలా ఉండేవాడని భక్తుల విశ్వాసం. ఈ చెరువు చివర నీటిలోనే బురుజుపై శ్మశాన వాటిక సైతం ఉంది. ఇప్పటికి వెంకటాద్రిపేట్ వాసుల దహన సంస్కారాలు ఇక్కడే చేస్తుంటారు.
ఏటా ఆలయంలో పూజలు
ఖజానా చెరువులోని ఓంకారేశ్వర ఆలయంలో ఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో మొట్టమొదటి ఆలయం ఇదే కావడంతో ప్రజలు ఈ దేవాలయాన్ని అత్యంత ప్రవిత్రంగా భావిస్తారు. ఏటా శివరాత్రిలో జాతర సైతం నిర్వహిస్తారు. నిత్యం పూజారి అక్కడ పూజలు నిర్వహించి అభిషేకం చేస్తారు. ఆ కాలనీలో ఏ శుభకార్యం చేసిన ఓంకారేశ్వర ఆలయంలో పూజలు చేపిన తరువాతనే మిగతా కార్యాక్రమాలు నిర్వహిస్తారు.