* మరో మార్గం కనిపించలేదన్న ఖర్గే
* అవిశ్వాసాన్ని తప్పుబట్టిన మంత్రి
* సోరోస్ ఆంశంతో సభలో రచ్చ
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అన్ని పార్టీల వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ.. అన్ని పక్షాల వారిని సమానంగా చూడాల్సిన రాజ్యసభ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్ మీద ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భారత చరిత్రలో ఇప్పటి వరకూ ఏ రాజ్యసభ చైర్మన్ మీద ఇలా అవిశ్వాసం ప్రవేశపెట్టలేదు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే ‘మరో అవకాశం లేకనే చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాం.
ఆయన ఓ స్కూల్ మాస్టర్‌లా వ్యవహరిస్తున్నారు. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలకు కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎవరినీ ఏమీ మాట్లాడనీయడం లేదు. రాజ్యసభ వాయిదాల పర్వానికి చైర్మనే కారణం. ఆయన తీరుతో విసిగిపోయి అవిశ్వాసం పెట్టాం’ అని అన్నారు. తమకు సంఖ్యా బలం లేనందున ఈ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందదని తెలిసినా కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇలా చేసినట్లు ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు.
మేము కాపాడుతాం: రిజిజు
ప్రతిపక్షం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని అధికార పక్ష నాయకులు ఖండిస్తున్నారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షం చైర్మన్ ప్రతిష్టకు భంగం కలిగించాలని చూసినా కానీ చైర్మన్‌ను మేము కాపాడుతాం’ అని అన్నారు. ఓ రైతు బిడ్డపై ఇంత ద్వేషం పెంచుకుంటారా? అని ప్రతిపక్షాన్ని రిజిజు ప్రశ్నించారు. ధన్‌కర్ సభామర్యాదలను కాపాడుతున్నారని తెలిపారు. అధికార పక్ష సభ్యులు గాంధీ కుటుంబం, సోరోస్ మధ్య సంబంధం గురించి ప్రశ్నలు గుప్పించారు.
వారం రోజులైనా..
శీతాకాల సమావేశాలు ప్రారంభ మై వారం రోజులు గడుస్తున్నా నేటికి కూడా సభలో ఒక్క అంశంపై సరైన చర్చ జరగలేదు. గౌతమ్ అదానీపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది.