ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఫార్మా వ్యాపారవేత్త వీరేన్ కుమార్తె రాధికా మర్చంట్‌తో గత నెలలో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు సందడి చేసిన సంగతీ విదితమే. అయితే, ఈ పెళ్లికి తాను హాజరు కాలేకపోవటానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. ఆహ్వానం అందినప్పటికీ తాను దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. నాకు ఫోన్ చేసి మరీ తన పెళ్లికి పిలిచారు. తప్పకుండా రావాలని కోరారు. అదే రోజు మా ఇంట్లో కూడా పెళ్లి ఉండటం వల్ల నేను రాలేనని బదులిచ్చా. ఆ రోజు మాకు ఎంతో ప్రత్యేకమైందని, నా చిన్న తమ్ముడి పెళ్లి ఉందని తెలిపా’ అని చెప్పుకొచ్చింది కంగన. వెడ్డింగ్స్‌లో పాల్గొనడంపై ఇంకా చెప్తూ.. ‘మరో విషయం ఏమిటంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవారి వివాహ వేడుకల్లో పాల్గొనడంలో అంతగా ఆసక్తి ఉండదు.
కుటుంబ వేడుకల్లోనే నేను ఇష్టంగా పాల్గొంటా’ అని తెలిపింది. నూతన జంటకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది. కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు కంగననే దర్శకత్వం వహించింది.