calender_icon.png 28 October, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాన్స్ అంటే అదే!

02-07-2024 12:05:00 AM

అప్పటిదాకా హిందీ చిత్రాల్లో తనదైన అందం, అభినయంతో మైమరిపింపజేసిన మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’తో టాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరైపోయింది. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’లో జత కట్టడం ద్వారా తన అభిమానుల సంఖ్యను పెంచేసుకుంది. విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’లో నటించగా, ఆ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. దీంతో కొత్తగా వస్తున్న అవకాశాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందీ భామ.

ఇటీవల విడుదలైన ‘కల్కి2898డీ’లో అతిథి పాత్రలో మెరిసిన ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. ‘నా దృష్టిలో రొమాన్స్ అంటే చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయితీగా ఉండటం, మన పట్ల శ్రద్ధ చూపటం, మన కోసం చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, ఎప్పుడూ మన ఆలోచనల్లో ఉండటం.. ఇవన్నీ గొప్ప రొమాంటిక్ చర్యలే అని నేను భావిస్తాను.

రొమాన్స్ అంటే మీరంతా అనుకుంటున్నది కాదు.. చిన్న టచ్ చాలు..!’ అంటూ సరసాన్ని సరికొత్తగా నిర్వచించిందీ సొగసరి. హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఓ హిందీ సినిమా చేస్తున్న మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల తనను సంప్రదించిన తెలుగు దర్శక నిర్మాతలెవరికీ ఓకే చెప్పలేదనేది ఫిల్మ్‌నగర్ టాక్.