నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35 -చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నివేత థామస్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సినిమా విశేషాలివీ..
- ‘35 -చిన్న కథ కాదు’ సినిమాలో నేను తల్లి పాత్రలో కనిపిస్తా. అందులో నివేత థామస్ కాకుండా సరస్వతి పాత్రే కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా ఇష్టం. భారతీయ సమాజంలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగడం సహజం. నేను హౌస్‌వైఫ్ క్యారెక్టర్ చేయడం సమస్యగా భావించలేదు. నటిగా అన్ని పాత్రలూ చేయాలి. మదర్ క్యారెక్టర్ అనే బదులు సరస్వతిగా బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను (నవ్వుతూ). నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మితే అంతకుమించి ఆనందం ఉండదు. సరస్వతి వయసులో నాకంటే ఏడాది చిన్నది. తనకు చిన్న ఏజ్‌లోనే పెళ్లవుతుంది. ఆమెకు పిల్లలున్నప్పటికీ తనలో ఒక చైల్డ్ నేచర్ ఉంటుంది. ఈ పాత్ర కొత్త అనుభూతినిచ్చింది.
- డైరెక్టర్ నంద కిషోర్ కథ అద్భుతంగా రాశారు. తిరుమల తిరుపతి వేంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. అందుకే అన్ని సీన్స్‌లోనూ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఇదొక అమాయక కుటుంబ కథ. ఎడ్యుకేషన్ స్టొరీ కాదు.. మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. బంధాల గురించి చెప్పే ఈ కథ కే విశ్వనాథ్ సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమాకు ‘35’ అనే టైటిల్.. మార్కులనుద్దేశించి పెట్టిందే! ఇందులో మా పెద్దబ్బాయికి అన్ని సబ్జెక్టులూ వస్తాయి కానీ, మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లమ్. ఈ కష్టాలు చాలా మంది రిలేట్ చేసుకునేలా ఉంటాయి. మా సినిమాకు ‘తారే జమీన్ పర్’ పోలిక ఉందనుకుంటున్నారు.. కానీ, అది వాస్తవం కాదు.
- తిరుపతి స్లాంగ్ కోసం ప్ర త్యేకంగా ఒక పుస్తకమే ప్రిపేర్ చేశాం. దాదాపు నెల రోజులు వర్క్‌షాప్ నిర్వహించాం.