calender_icon.png 24 October, 2024 | 4:55 PM

‘బడ్డీ’కి అదే పెద్ద సవాల్

02-08-2024 12:05:00 AM

“ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒకదాని తర్వాతే మరొకటి. అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయి. అందులోనూ ఏ సినిమా అయినా అనుకున్న టైమ్‌కు చేయడం చాలావరకు వీలుపడదు” అన్నారు అల్లు శిరీష్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బడ్డీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాత్రికేయులతో శిరీష్ సినిమా సంగతులను పంచుకుంటూ “ఈ సినిమాని గత మార్చిలో మొదలుపెట్టి జూలైలో పూర్తి చేశాం. నిర్మాత మాతో చెప్పింది ఒక్కటే.. కావాల్సింది ఇస్తాను కానీ, తక్కువ రోజుల్లో షూటింగ్ చేయండని.

దాంతో రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం. డిసెంబర్‌లో విడదల చేయాలన్నది మా ప్లాన్. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. దాంతో లేట్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీదే సినిమా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్ అనుకున్నది కాస్త ఇప్పుడిలా ఆగస్టుకు వచ్చింది. పోస్టర్ రిలీజ్ నుంచి “బడ్డీ” రీమేక్ సినిమా కదా అని కామెంట్స్ వచ్చాయి. కాదు స్ట్రుటై సినిమానే అని చెప్పడమే మాకు పెద్ద సవాల్‌గా మారింది. దర్శకుడు టెడ్డీ బేర్‌తో సినిమా అని చెప్పినపుడు.. తమిళంలో ‘టెడ్డీ’తో పాటు ఇంగ్లీష్‌లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను.

అయితే కథ పూర్తిగా తెలుసుకున్నాక టెడ్డీ బేర్‌కు ప్రాణం రావడం అనే ఒక్క అంశాన్ని మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్తగా ఉంటుంది. ఒక పాత విమానం కొని అందులో ఆర్ట్ వర్క్ చేసి షూట్ చేశాం. క్లుమైక్స్ ఫైట్ ఆ విమనంలోనే ఉంటుంది. టికెట్ ధరలు తగ్గించాం. మూవీ రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాలే. ఇప్పటికే జరిగిన ప్రత్యేక ప్రదర్శనలకి మంచి ఆదరణ లభించింది” అంటూ బడ్డీ సంగతులను ముగించారు.