ప్రస్తుత కాలంలో ఉపాధి కోసం ఉన్న ఊరిని వదిలి వెళ్లేవాళ్లు చాలామంది ఉన్నారు. కొన్ని కారణాల వల్ల కుటుంబాన్ని కూడా సొంతూళ్లోనే ఉంచుతారు. దీంతో దంపతులైనా కొన్ని రోజులు విడిగా ఉండక తప్పట్లేదు. అయితే ఇలా దూరంగా ఉండటం వల్ల బంధం బలహీనపడుతుందని చాలామంది భావిస్తారు. కొన్నిసార్లు అలా జరుగుతుంది కూడా. ఇలా మనసుల మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
దూరంగా ఉన్నామని నిత్యం ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుంటారు చాలామంది. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పనిభారం ఎక్కువైనా మీ తీరు మరింత విసిగిస్తుంది. అప్పుడే గొడవలొచ్చేది. కాబట్టి ప్రతి కదలికా తెలుసుకోవాలన్న తపనొద్దు. బిజీగా ఉన్న సమయంలో ఫోన్ చేసి, తీరా వారు సరిగ్గా మాట్లాడకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడతారు. ఇలా కాకుండా ఉండాలంటే అనువైన వేళలేవో కనుక్కొని అప్పుడే ఫోన్ చేస్తే సరి.
అర్జెంటు విషయమైతే మెసేజ్ పెడితే వాళ్లే చూసుకొని స్పందిస్తారు. దూరంగా ఉంటున్నప్పుడు ప్రతికూల ఆలోచనలు నింపేవారూ ఎక్కువే ఉంటారు. అవి పట్టించుకోవద్దు. ఇతరుల వద్దా మీ అభద్రతా భావాన్ని బయట పెట్టొద్దు. నమ్మకంతో సాగండి. కొన్నిసార్లు దూరాలూ మనసుల్ని దగ్గర చేస్తాయి.