calender_icon.png 15 January, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నిర్ణయం సరికాదు

18-07-2024 12:37:24 AM

బ్రాహ్మణ పరిషత్ నిధులు విడుదల చేయాలి

బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): దేవాలయాల పూజారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాల్లోని పూజారులను బదిలీ చేయాలని చూస్తే కోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. పూజారులు, అర్చకుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 64 జారీ చేయగా... దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోర్టు స్టే విధించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గోపూజ చేశారని, తన గెలుపు కోసం బ్రాహ్మణుల ఆశీర్వాదాలు అవసరమయ్యాయని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బ్రాహ్మణులను పట్టించుకునడంలేదని మండిపడ్డారు. గత 7 నెలలుగా బ్రాహ్మణ పరిషత్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఫలితంగా పేద బ్రాహ్మణులు ఏడుస్తున్నారని తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ సహకారంతో విదేశాలకు వెళ్లిన నిరుపేద బ్రాహ్మణుల పిల్లలు ప్రభుత్వ సాయం అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. స్వయం ఉపాధి, రుణాల కోసం ఇస్తామన్న రుణ సౌకర్యం నేటికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. బ్రాహ్మణ పరిషత్‌ను గత ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి తాను కొనసాగించనని సీఎం భావించడం సరైన చర్య కాదని ప్రభాకర్ హితవు పలికారు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు విడుదల చేయాలని కోరారు.