calender_icon.png 27 October, 2024 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కోర్సు లేదు.. అభ్యర్థులూ లేరు!

14-09-2024 12:55:12 AM

ఇచ్చంత్రం!

  1. ఆయూష్‌లో 308 పోస్టుల నియామకానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 
  2. ఈ నెలలోనే నోటిఫికేషన్, నవంబర్‌లో పరీక్ష 
  3. ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీకి స్కెచ్?
  4. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఆయూష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి)లో ఫార్మసిస్ట్ ఉద్యోగానికి రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ‘ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మాసిస్ట్’ కోర్సును కనీస విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఏ విద్యాసంస్థలలో (ప్రభుత్వ, ప్రైవేటు) కూడా ఇప్పటివరకు ఆ కోర్సు లేదు. ఆ కోర్సు చదివిన అభ్యర్థులు అసలే లేరు.

కానీ రాష్ట్రంలో ఆయూష్ దవాఖానలలో ఉన్న 308 ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 308 పోస్టుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీచేసి నవంబర్‌లో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది. విచిత్రం అనిపించినా ఇదే నిజం. కొందరు అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలోనే ఇప్పటివరకు లేని కోర్సు అర్హతతో ప్రభుత్వం ఆయుష్‌లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి ఆదోళన వ్యక్తం అవుతున్నది. 

ఖాళీల భర్తీపై సర్కార్ నజర్..

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం వైద్య ఆరోగ్యశాఖలో పలు ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేయగా, తాజాగా ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లోని ఫార్మాసిస్టుల భర్తీ కోసం ఇదే నెలలో (2024 సెప్టెంబర్) నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు సమాయత్తం అవుతోంది. కానీ రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ‘ఆయుష్ డిప్లమా ఇన్ ఫార్మాసిస్ట్’ కోర్సు చదివిన అభ్యర్థులు తెలంగాణలో ఒక్కరు కూడా లేకున్నా 308 పోస్టుల భర్తీకి ప్రభుత్వం  కసరత్తు ప్రారంభించింది. 

కోర్సు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం!

ఫార్మసీ ఇన్ డిప్లమా కోర్సు ప్రవేశపెట్టాలని ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో మే 29న జరిగిన ఆయుష్ శాఖ సమీక్ష సమావేశంలో.. రెండేళ్ల డిప్లమా కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగిందని ఆయూష్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం ఒక కమిటీ నియమించి, పక్క రాష్టాల్లో ఉన్న సిలబస్‌ను పరిశీలించి 40మందితో కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ‘విజయక్రాంతి’కి తెలిపారు.

అయితే 2024 మే 29వ తేదీన రాష్ట్రంలో ఫార్మసీ ఇన్ డిప్లమా కోర్సు లేదని, ఈ కోర్సు అభ్యసించిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేరని ప్రభుత్వానికి తెలిసినా 2024 ఆగస్టు 2వ తేదీన ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో 308 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంపై పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థులతో 308 పోస్టులను భర్తీ చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. 

2017లో జీవో జారీ... 2022లో నోటిఫికేషన్

ఆయూష్‌లో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ఇన్ సర్వీసులోకి వచ్చిన అభ్యర్థులకు ఆరు నెలల పాటు థియరీ, ఆరు నెలలు ప్రాక్టికల్ అనుభవంతో కూడిన ఇన్ సర్వీస్ ట్రైనింగ్‌ను పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ట్రైనింగ్ సర్టిఫికెట్ జారీ చేసే నిబంధన మాత్రమే రాష్ట్రంలో అమలులో ఉంది. ఈ క్రమంలోనే ఆయూష్ ఫార్మసిస్ట్ పోస్టుకు కనీస విద్యార్హతలుగా రెండు సంవత్సరాల కాలవ్యవధి గల డిప్లమా ఇన్ ఆయూష్ కోర్సును కనీస విద్యార్హతలుగా పేర్కొంటూ 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవోగె జారీ చేసింది.అలాగే ఆయూష్‌లో ఫార్మసి పోస్టుల భర్తీ కోసం 2022లో కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించినప్పటికి తదనంతరం జరిగిన పరిణామాల వలన హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు నియామక బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ కోర్సు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే లేదనే విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖలు రాయడంతో పాటు గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫార్మసీ ఇన్ డిప్లమా (ఆయుష్) కోర్సు అభ్యసించిన అభ్యర్థులు లేని కారణంగా రాష్ట్రంలోని పలు దవాఖానలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఫార్మాసిస్టులకు శిక్షణ ఇచ్చి అర్హులుగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. 

ఆయూష్‌లో 17 యేండ్లుగా...

తెలంగాణ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్ధతిన ఆయుష్‌లో ఫార్మాసిస్ట్‌లుగా పదోతరగతి అర్హతతో కాంపౌండర్ పేరిట చేరిన వారు ఫార్మసిస్టులుగా కొనసాగారు. అనంతరం 2005 నుంచి వీరిలో ఇంటర్ సైన్స్ (బైపీసీ) గ్రూప్ అర్హత ఉన్న వారిని ఫార్మాసిస్టుగా మార్చారు. గత 17యేండ్లుగా కాంట్రాక్టు ఫార్మసిస్టులుగా కొనసాగుతున్న తమకు అంగన్వాడీ సూపర్ వైజర్ రిక్రూట్‌మెంట్ మాదిరి కోర్స్‌ను 5 ఏళ్లలో పూర్తి చేయాలనే నిబంధన పెట్టి, విద్యార్హతల నుంచి తమను మినహాయింపు ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో 17 ఏండ్ల కాంట్రాక్ట్ సర్వీస్‌ను గుర్తించి ప్రత్యేకంగా మార్కులు ఇవ్వాలని, నిబంధనలను సడలించి ఆయూష్ ఫార్మసిస్ట్ పోస్టుకు తమను కూడా అర్హులుగా గుర్తించాలని 421 మంది కాంట్రాక్టు ఫార్మసిస్టులు కోరుతున్నారు.