calender_icon.png 13 November, 2024 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ చల్లని సముద్ర గర్భం

22-07-2024 12:00:00 AM

పల్లవి: ఆ చల్లని సముద్ర గర్భం

దాచిన బడబానల మెంతో?

ఆ నల్లని ఆకాశంలో

కానరాని భాస్కరులెందరో?

చరణం: భూగోళం పుట్టుక కోసం

రాలిన సురగోళాలెన్నో?

ఈ మానవ రూపం కోసం

జరిగిన వరిణామాలెన్నో?

ఒక రాజుని గెలిపించుటలో

ఒరిగిన నరకంఠాలెన్నో ?

శ్రమజీవుల పచ్చినెత్తురులు

తాగని ధనవంతులెందరో?

మానవ కళ్యాణం కోసం

పణమొడ్డిన రక్తం ఎంతో

రణరక్కసి కరాళ నృత్యం

రాల్చిన పసి ప్రాణాలెన్నో  

కడుపు కోతతో అల్లాడిన

కన్నులలో విషాదమెంతో

ఉన్మాదుల అకృత్యాలకు

దగ్ధమైన బ్రతుకులు ఎన్నో

అన్నార్తులు అనాథలుండని

ఆ నవయుగ మదెంత దూరమో?

కరువంటూ కాటకమంటూ

కనిపించని కాలాలెపుడో?

అణగారిన అగ్నిపర్వతం

కని పెంచిన లావా యెంతో?

ఆకలితో చచ్చే పేదల

శోకంలో కోపం యెంతో?

పసిపాపల నిదుర కనులలో

ముసిరిన భవితవ్యం ఎంతో?

గాయపడిన కవి గుండెలలో

రాయబడని కావ్యాలెన్నో?

కులమతాల సుడిగుండాలకు

బలియైన పవిత్రులెందరో?

భరతావని బలపరాక్రమం

చెర వీడే దింకెన్నాళ్ళకో?

 దాశరథి కృష్ణమాచార్య

రచనా కాలం: 1949