హరారే: ఐపీఎల్లో మెరుపులతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. జాతీయ జట్టు తరఫున ఆడిన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. జింబాబ్వేతో రెండో టీ20 ఆరంభంలో ఆచితూచి ఆడిన అభిషేక్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతు 46 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం అభిషేక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. జింబాబ్వేపై సెంచరీ చేసిన బ్యాట్ తనది కాదని.. సారథి శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తోనే వీరవిహారం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక తొలి మ్యాచ్‌లో డకౌటైనప్పుడు కూడా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనను అభినందిచినట్లు అభిషేక్ తెలిపాడు. ‘తొలి మ్యాచ్‌లో సున్నాకే ఔటైన తర్వాత యువీ పాజీ నాతో మాట్లాడాడు. అంతా మంచికే అని చెప్పారు. ఇక రెండో మ్యాచ్‌లో సెంచరీతో ఆయన గర్వపడి ఉంటారు. ఆరంభంలో కుదురుకున్నట్లు అనిపిస్తే చాలు భారీ షాట్లు కొట్టేందుకు వెనుకాడను. అండర్ స్థాయి నుంచి గిల్, నేను కలిసి ఆడుతున్నాం. గత మ్యాచ్‌లో అతడి బ్యాట్‌తోనే సెంచరీ చేశా’ అని అభిషేక్ చెప్పాడు.