ప్రపంచ సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితాను తాజాగా అకాడమీ ప్రకటించింది. 23 విభా గాలతో కూడిన జాబితా వచ్చేసింది. మన దేశం నుంచి ‘అనుజా’ అనే లఘు చిత్రం ఆస్కార్ నామినేషన్ల జాబితాలో నిలిచింది. ఆడమ్ జే గ్రేవ్స్ రూపొందించిన ఈ చిత్రాన్ని గునీత్ మోంగా నిర్మించగా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనుజా అనే తొమ్మిదేళ్ల చిన్నారి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారిది నిరుపేద కుటుంబం కావడంతో చదువుకొనే స్థోమత లేక అక్కతో కలిసి పనికెళ్తుటుంది. అయినా చదువుకోవాలన్న ఆశను మాత్రం వదులుకోదు.
చదువు గురించి సోదరిని అడిగి తెలుసుకోవడంతో చదువుకోవాలన్న తపన ఆమెలో మరింత పెరుగుతుంది. మరోవైపు తన కుటుంబ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంది. అనుకోకుండా చదువుకునే అవకాశం రావడం.. ఆ తర్వాతి పరిస్థితులను గ్రేవ్స్ కళ్లకు కట్టారు.
సజ్దా రియల్ లైఫ్ కూడా అంతే..
ఈ చిత్రంలో నటించిన సజ్దా పఠాన్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సజ్దా పఠాన్ జీవితం రియల్ లైఫ్ కూడా సమస్యలతో కూడుకున్నదే. ఢిల్లీలో బాల కార్మికురాలిగా పని చేస్తున్న సజ్దాను సలామ్ బాలక్ ట్రస్ట్ చేరదీయడంతో ఆమె జీవితంలో మలుపు తిరిగింది. వెట్టి చాకిరి నుంచి ఆమెకు విముక్తి లభించడమే కాక ఆశ్రయం కూడా కల్పించింది. ట్రస్ట్ సహకారంతోనే సినీరంగంలోకి అడుగు పెట్టింది. ‘ది బ్రెయిడ్’ చిత్రంలో తొలిసారిగా నటించింది.