calender_icon.png 26 October, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థ్యాంక్యూ డాక్టర్ గారూ!

01-07-2024 12:00:00 AM

మిధానిలో పది రూపాయలకే మెరుగైన వైద్యం

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మిధాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ట్రస్టు సభ్యులు అంకితభావంతో మానవత్వం చాటుకుంటున్నారు.బీపీఎల్‌కు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు,ఆరోగ్య శ్రీ కార్డు,అంత్యోదయ అన్నయోజన కార్డు,ప్రయారిటీ హౌస్ హోల్డ్ కార్డు,అన్నపూర్ణ యోజన కార్డు కలిగిన పేద,మధ్యతరగతి ప్రజలకు10 రూపాయాలకే వైద్యం అందిస్తున్నారు.ప్రైవేట్ వైద్యశాలలకు దీటుగా సేవలను అందిస్తూ వైద్యం కోసం వచ్చిన వారి వద్ద కేవలం రూ.10 రూపాయాలనే తీసుకొని వైద్యం సేవలను  అందించడం విశేషం.పది రూపాయాల్లో వైద్యంతో పాటు మందులను ఉచితంగా అందిస్తున్నారు.మరో అడుగు ముందుకేసి ఏదైనా ల్యాబ్ టెస్టు అవసరం ఉంటే మరో పది రూపాయాలకే టెస్టులు చేసి రిపోర్టులు అందించడం  ట్రస్టు యొక్క గొప్పతనం.

కొత్త ప్రణాళికతో అధునిక సాంకేతిక పద్దతిలో ల్యాబ్ టెస్టులు కూడా అందిస్తున్నారు.వీటితో పాటు ఉచితంగా కంటి పరీక్షలు,మందులను అందిస్తుంది.అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించి మెరుగైన చూపు వచ్చేలా కృషి చేస్తున్నారు.వైద్యశాలలో ఆరు పడకలను అందుబాటులో ఉంచారు.ప్రస్తుత కాలంలో ఓ ఇంట్లో వ్యక్తికి ఆరోగ్యం బాగో లేకపోతే ప్రైవేట్ వైద్యశాలలో కనీసం రూ.500 వందల వరకు ఖర్చు అవుతుంది.అదే పెద్ద ఆసుపత్రులు అయితే అంతే సంగతులు.కూలీ పనులు,చిరు వ్యాపారాలు చేసుకునే పేద,మధ్య తరగతి ప్రజలు ఆర్థిక స్తోమత లేని ఎంతో మందికి నేడు మెరుగైన వైద్యం దొరకడం లేదు.

ఆరోగ్యం క్షిణిస్తే  పరిస్థితి దారుణంగా ఉంటోంది.కానీ స్వంత లాభపేక్ష లేకుండా పది రూపాయాల్లోనే వైద్యం అందించడం మిధాని ట్రస్టుకే చెల్లింది.ఆదివారం సెలవు రోజుల్లో తప్ప మిగితా అన్ని రోజులు ఉదయం 9.30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యం అందిస్తారు.ల్యాబ్ టెస్టులు అయితే ఉదయం 7.30 నిమిషాల నుంచే ప్రారంభం అవుతాయి.ఇద్దరు ఎంబీబీఎస్ చదివిన అనుభవజ్ఞులైన డాక్టర్లతో పాటు 13 మంది స్టాఫ్ వివిధ విభాగాలలో సేవలను అందిస్తున్నారు. ఒక అంబులెన్సు డ్రైవర్ కూడా అందుబాటులో ఉంటారు.ప్రతి రోజు 80 నుంచి 100 మంది వరకు ఈ వైద్యం కోసం వస్తుంటారు.మొదటి సారి వచ్చిన వారికి పది రూపాయాలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది.ఆ తరువాత మరో పది రూపాయలకు వైద్యం అందిస్తారు.ఇందులోనే ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది.

ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత ఎప్పుడు వచ్చిన తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరు రోజుల్లో మరోసారి ఎప్పుడు  వచ్చిన ఉచితంగా వైద్యం సేవలను ఉచితంగానే అందిస్తారు.వైద్యశాల ప్రారంభమైన నాటి నుంచి నేటీ వరకు దాదాపుగా 3 వేల మందికి వైద్య సేవలను అందించారు.అయితే 14 ఏళ్లు వయస్సు పై బడిన వారికి మాత్రమే వైద్య సేవలు అదిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఒక్కో ల్యాబ్ టెస్టుకు కేవలం 10 రూపాయలు మాత్రమే..

మిధాని ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యం, మందులు అందించడమే కాదు రోగికి అవసమైన టెస్టులను కూడా కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు. సాధారణ పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షల వరకు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, షుగర్, బీపీ ఇలా మొత్తం 30 టెస్టులకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉంది. అంటే ముప్పు టెస్టులు కేవలం రూ.300 వందలకే అన్నమాట. ప్రైవేట్ వైద్యశాలలో కనీసం ఒక్కో టెస్టుకు వంద రూపాయల నుంచి 2 వేల వరకు కూడా  ఉంటుంది. అలాంటిది 10 రూపాయలకే ల్యాబ్ టెస్టులు కూడా అందుబాటులో ఉండటం సామాన్య ప్రజలకు వరంగా మారింది.

బీపీఎల్ కార్డు లేని వారి కోసం కూడా వైద్య సేవలు..

బీపీఎల్ కార్డులు కలిగిన వారికి కేవలం పది రూపాయలకే వైద్యం అందించే మిధాని ట్రస్టు అసలు ఏ కార్డు లేని వారి కోసం కూడా సేవలను అందిస్తుంది. అయితే కార్డు లేని వారి వద్ద నుంచి 30 రూపాయలను తీసుకొని వైద్య సేవలను అందిస్తారు. ప్రతి నెల 95శాతం కార్డులు కలిగిన వారే వైద్యం కోసం వస్తుంటారు. మిగతా ఐదు శాతం కార్డు లేని వారు వస్తుంటారని డాక్టర్లు తెలిపారు.

కరోనా సమయంలో సేవలందించిన ట్రస్టు..

మిధాని ట్రస్టు సభ్యులు కరోనా సమయంలో సేవలను అందించి మంచి మనస్సు చాటుకున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీల్లో సేవలను అందించే ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు. అంతేకాకుండా ఉస్మానియా వైద్యశాలకు ఓ అంబులెన్సును అందించడంతో పాటు రూ 90 లక్షలను రోగుల కోసం విరాళంగా ఇచ్చారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి ఉచిత నేత్ర పరీక్షలు, ఎముకలకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. ఇటివలే శ్రీ సత్యసాయి సేవా సమితి కెరెల్లి, మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ హైదరాబాద్ సంయుక్తగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కెరెల్లి గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి వైద్య సేవలను అందించి శభాష్ అనిపించుకున్నారు.

 బండ ఐలయ్య, మహేశ్వరం, విజయక్రాంతి 

అభిప్రాయాలు

* గత 2 ఏళ్లుగా మిధాని ట్రస్టు చైర్మన్ కె.మధుబాల (జీఎం ఫైనాన్స్),వి.హరికృష్ణ (ఏజీఎం హెచ్‌ఆర్),డాక్టర్ పి.వీరరాజు (చిఫ్ మెడికల్ ఆఫీసర్),ఎం.బీ హిందు(డీజీఎం పర్చేస్),కె.విజయ్ సింగ్ (డీజీఎం ఫైనాన్స్) ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు సేవలను అందిస్తున్నారు.ప్రతిరోజు 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.రెండేండ్ల కాలంలో 3 వేయిల్యా మందికి పైగా వైద్యం అందించాం.వీటితో పాటు ఉచిత కంటి పరీక్షలు,ఎముకల పరీక్షలు,సాధారణ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నాం.

 డాక్టర్ వీరరాజు, చీఫ్ మెడికల్ ఆఫీసర్

* ఆరోగ్యం బాగాలేకుంటే మా ఇంట్లో అందరం ఇక్కడికే వచ్చి డాక్టర్ వద్ద చూపించుకుంటాం.ఏడాది నుంచి ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చిన పది రూపాయాలను తీసుకొని వైద్యం అందిస్తారు. ఉచితంగా మందులను కూడా ఇస్తారు.ప్రైవేట్ దవా ఖానాలో ఒక్కసారి పోతే రూ.300 నుంచి 500 వందలు అవుతుంది.ఇక్కడే పేదలకు మంచిగా చూస్తారు.మిధాని వైద్యం అంటేనే పేదల ఆసుపత్రిగా పేరోచ్చింది.

 డి.మణెమ్మ, సుభాష్ చంద్రబోస్ కాలనీ