calender_icon.png 23 February, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బురపరిచే శిల్ప సౌందర్యం!

23-02-2025 12:31:36 AM

భారతీయ శిల్పకళా వైభవానికి చారిత్రక నిదర్శనం తంజావూరు. అంతుచిక్కని రహస్యాలను ఇమడ్చుకున్న అద్భుత ఆల యం బృహదేశ్వరాలయం. నింగిని ముద్దాడుతున్నట్టు కనిపిస్తున్న ఈ చారిత్రాత్మక ఆలయం వెయ్యేళ్ల కింద టి నిర్మాణ నైపుణ్యతకు, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతున్నది. యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటైన ఈ ఆలయంలోనే ఓ భారీ నంది విగ్రహం కనిపిస్తుంది.

మన లేపాక్షి బసవన్న తర్వాత ఎత్తయిన నంది ఇదే కావడం విశేషం. ఈ నంది విగ్రహాన్ని ఏకశిలతో నిర్మించారు. ఈ నంది మండపాన్ని చోళ రాజుల తర్వాత పరిపాలించిన నాయక రాజులు అందమైన నగిషీలతో చిత్రించి అద్భుత రీతిలో మలిచారు. 

ట్రావెల్

తంజావూరు.. సకల కళలకు నిలయం. ఇది భిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు చారిత్రక నిదర్శనం. తంజావూరు ఆధ్యాత్మిక, పర్యాటక వైభవాన్ని తనలో దాచుకున్నది. చెక్కుచెదరని శిల్పకళా సౌందర్యంతో పర్యాటకులను అబ్బురపరుస్తున్నది తమిళనాడులోని తంజావూరు.  

సరస్వతి మహల్ లైబ్రరీ

తంజావూర్‌లో సరస్వతి మహల్ లైబ్రరీ ఆసియాలోనే పురాతనమైనది. ఇక్కడ తాళపత్ర, తమిళ, మరాఠీ, తెలుగు, ఆంగ్ల భాషలతో రాసిన ఆకాలం నాటి కాగితం, పుస్తకాలపై అచ్చు ప్రతులను చూడవచ్చు. ఈ లైబ్రరీని నాయక్ రాజులు స్థాపించారు. 

పండుగలు

రాజరాజ చోళుని జన్మదినం సందర్భంగా ఇక్కడ ప్రతి నెల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ మహారాజు పేరిట ఉత్సవాలు, పూజాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా వైశాఖ మాసంలో తొమ్మిది రోజులపాటు బృహదేశ్వరాలయంలో జరిగే వేడుకలకు దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులు హాజరై.. తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇక్కడి ఆలయాల వైభవాన్నీ.. శిల్ప కళాచాతుర్యాన్నీ వర్ణించడానికి మాటలు చాలవు. ఏమైతేనేం ఇంతటి మహోన్నత చరిత్ర గల ఆలయాన్ని తనివితీరా చూసి తరించాల్సిందే.

ఎలా వెళ్లాలి  

హైదరాబాద్ నుంచి తంజావూరు 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు, బస్సు, విమాన సౌకర్యం కలదు. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది.