calender_icon.png 22 September, 2024 | 9:07 PM

తలసేమియా, సికిల్ సెల్ బాధితుల సమస్యలు పరిష్కరించాలి

22-09-2024 06:55:57 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్, హీమోఫిలియా వ్యాధిగ్రస్తుల సమస్యలను సంబంధిత అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ను తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ను ఆదివారం ఆయన  నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాలోని తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం రిమ్స్ మెడికల్ కళాశాలలో రక్తం ఎక్కించే కేంద్రాన్ని ప్రారంభించాలని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం అందించే ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న తలసేమియా, సికిల్ సెల్, హీమోఫిలియో, సికిల్ తాల్ వ్యాధిగ్రస్తులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం డిజబులిటి బిల్లు-2016లో వికలాంగులుగా గుర్తించిందని, దాని ప్రకారం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 13, 2018 న జిఓ నెంబర్ 5ను విడుదల చేసి, వికలాంగులుగా గుర్తించి, జిఓ ను అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ నేటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జిఓ నెంబర్ 5 ను అమలు చేయడం లేదని తెలిపారు.

అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఇన్ఫ్యూజ్ పంపులు, డేస్వరాల్ ఇంజక్షన్లు బోన్ మారో మార్పిడి తదితర చికిత్సలు అందేలా ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని కోరారు. స్పందించిన ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడి, తలసేమియా, సికిల్ సెల్ బాధితుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్సోసైట్స్ హెల్త్ కేర్ అసోసియేట్ వైద్యులు డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ ఓంకార్నాథ్,డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, డాక్టర్ ప్రవీణ్, తలసేమియా వ్యాధిగ్రస్తులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.