22-02-2025 07:15:51 PM
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
జనగామ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల తీరు ఒక అడుగు ముందుకు.. రెండడుగు వెనక్కి అన్నట్లుగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు(CPI State Assistant Secretary Thakkallapalli Srinivasa Rao) అన్నారు. జనగామలోని గబ్బెట్ట గోపాల్ రెడ్డి భవన్ లో కావటి యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, పంటల బీమా పథకం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పించన్ల పెంపు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ హామీల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులోనూ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ .రాజారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, రావుల సదానందం, చామకుర యాకూబ్, జువారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.