9,10 తేదీల్లో ప్రభుత్వంతో సమావేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు తెలంగాణకు వచ్చే తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ఈ నెల 8న కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా బృందం హైదరాబాద్ చేరుకోనుంది. 9,10 తేదీల్లో ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్టు విశ్వసనీయం వర్గాల సమాచారం. ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో బుధవారం ఆర్థిక శాఖతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరిపారు. కమిషన్‌కు చేయాల్సిన రికమండేషన్లపై సమాలోచనలు చేశారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనందించేలా ప్రతిపాదనలు ఉండాలని సీఎం సూచన చేశారు. ఈ మేరకు 15వ ఫైనాన్స్ కమిషన్‌కు చేసిన రికమండేషన్లపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం.
సీఎంతో మీటింగ్ అనంతరం ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారులు అంతర్గతం చర్చలు జరిపారు. ప్రతిపాదనల్లో ఏఏ అంశాలు ఉండాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం. గ్రామాలు, పట్టణాలు, విపత్తులకు సంబంధించి రాష్ట్రాలకు చేయూతనందించేందుకు ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కమిషన్ సిఫార్సులను భట్టే ఉంటాయి. అందుకే అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్‌బీ), రూరల్ లోకల్ బాడీస్(ఆర్‌ఎల్‌బీ), డిజాస్టర్‌కు సంబంధించి వీలైనన్ని ఎక్కువ నిధులను తెలంగాణకు రాబట్టుకునేలా ప్రతిపాదనలు ఉండాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు ఈ మూడు అంశాల ఆధారంగా రేవంత్ సర్కారు రికమండేషన్లు ఉండే అవకాశం ఉంది. యూఎల్‌బీలో భాగంగా మూసీ పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు అడిగే అవకాశం ఉంది.
అక్టోబర్ 31లోగా రాష్ట్రపతి వద్దకు
15వ ఫైనాన్స్ కమిషన్ వ్యవధి 2026 మార్చి 31తో ముగుస్తుంది. ఈలోగా 16వ ఫైనాన్స్ కమిషన్ ముసాయిదాను సిద్ధంగా ఉంచేందుకు కేంద్రం ఇప్పటి నుంచే కసరత్తును మొదలు పెట్టింది. జనవరి 1న నీతి ఆయోగ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ పనగడియా ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన కమిషన్‌ను రాష్ట్రపతి ఆమో దంతో కేంద్రం ప్రకటించింది. 2025 అక్టోబర్ 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో సమావే శాలను నిర్వహించి.. ముసాయిదాను కమిషన్ రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది.