హీరో శర్వానంద్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సిద్ధమయ్యారు. తన 38వ చిత్రం కోసం శర్వా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుపొందిన సంపత్ నందితో చేతులు కలిపారు. ఈ మేరకు మేకర్స్ గురువారం ప్రకటన చేశారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ ప్రాజెక్టును మేకర్స్ ప్రస్తుతం ‘శర్వా38’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఇది 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-, మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. సబ్జెక్ట్ యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేసిన దర్శకుడు, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్లో చూపించనున్నారు. 60ల నాటి క్యారెక్టర్‌ను పోషించేందుకు శర్వా కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె.