calender_icon.png 17 April, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఎస్‌సీ పూర్తిగా టీపీసీసీగా వ్యవహరిస్తోంది

14-04-2025 01:31:37 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఇచ్చిన నోటీసుల పై ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా టీజీ పీఎస్సీ నోటీసులపై వారు మాట్లాడుతూ టీజిపిఎస్సి పూర్తిగా టీపీసీసీగా వ్యవహరిస్తోంది.

అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తా, జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటీసులు ఇచ్చారు.

టీజీ పీఎస్సీ ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ గా ఉండాల్సిందిపోయి. ప్రశ్నించిన నాలాంటి వాళ్ళకు నోటీసులు ఇస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. టీజీ పీఎస్సీ ఏమైనా న్యాయ సంస్థ, జ్యుడీషియల్ బాడినా? కోర్టు చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని ఉండు. సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అని నాకు ఆంక్షలు పెట్టడం ఏంటి? మాట్లాడితే కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చెయ్యడం ఏంటి అసలు మీ పరువు నేను మాట్లాడితే పోలేదు. మీరు వ్యవహరిస్తున్న తీరు వల్లనే మీ టీజీ పీఎస్సీ పరువు పోయింది.ఆధారాలు లేకుండా మాట్లాడావు అని నాకిచ్చిన నోటీసులో అన్నారు.

ఆధారాలు కాదు ఐరన్ రాడ్ లాంటి ఆధారాలు నాదగ్గర ఉన్నాయ్. నిర్లక్ష్యం తో మాట్లాడాను అని నన్ను అంటున్నారు. నేను చేసిన ప్రతీ ఆరోపణకు కట్టుబడి ఉన్నాను. దమ్ముంటే నా వాక్యాల పై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి, విచారణ కమిటీ వేయండి. నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాను. దేశంలో ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్ మెయిన్స్ కు మరొక హాల్ టికెట్ ఇవ్వడం ఏంటి? ఇది టీజీ పీఎస్సీ ఘనత! మీ చౌకబారు వ్యాఖ్యలకు నిరసనగా నేను కూడా పరువునష్ట దావా వేయడం పై పరిశీలిస్తా, ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్నారు.

ఆత్మగౌరవం దెబ్బతినడం జరిగింది. నా గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగింది. నా పరువు కు కూడా నష్టం వాటిల్లిందని, నేను రాజకీయ మైలేజి కోసం విమర్శలు చేసేవాణ్ణి అయితే ఇంత లోతుగా అవగాహన చేసుకొని ప్రతీ అంశాన్ని విశ్లేషించి విపులీకరించి మాట్లాడేవాన్నే కాదు. మరి పరీక్షలో అన్యాయం జరిగినా వారు అందరూ దీనిపై వారి వారి వెసులుబాటు ద్వారా ప్రశ్నిస్తున్నారు.

వారందరిపై ఇలాంటి చర్యలే తీసుకుంటారా? మీరు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం చెయ్యడం ఆధారబాధరాగ చేసిన నిర్వాకం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు ఎలాంటి పరిహారం కట్టిస్తారు. ఎలా న్యాయం చేస్తారో స్పష్టం చెయ్యాలి. మాకు కేసులు కొత్తకాదు బిఆర్‌ఎస్  పార్టీకి పోరాటడం, ఉద్యమాలు చెయ్యడం కొత్తకాదు. గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేం ఉంటాం. న్యాయం జరిగే వరకు కొట్లాడుతామని హెచ్చరించారు.