calender_icon.png 2 October, 2024 | 1:57 PM

తప్పులు సరిదిద్దని టీజీపీఎస్సీ

02-10-2024 02:54:42 AM

  1. ప్రాథమిక కీలో తప్పులున్నా పట్టించుకోవట్లే
  2. ఇది పూర్తిగా నిర్వహణ వైపల్యం
  3. గ్రూప్-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో వాదనలు 

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పరీక్షల నిర్వహణలో గత వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడంలేదని, ప్రస్తుతం అదే విధమైన నిరక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని అన్నారు. ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న వినతులను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు జీ శివ జైసుధీర్ వాదించారు.

గతంలో గ్రూప్- నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఫలితం లేకపోయిందని చెప్పారు. టీజీపీఎస్సీ నిర్వాకం వల్ల ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

వందల పోస్టుల భర్తీ నిమిత్తం నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది దరఖాస్తులు చేశారని, ‘కీ’లో కూడా 7 ప్రశ్నలకు సమాధా నాలు తప్పుగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఏడు ప్రశ్నలకు సమాధానాలు గందరగోళంగా ఉన్నాయని చెప్పారు. ఆ ప్రశ్నలను తొలగించి తిరిగి ‘కీ’ విడుదల చేయాలని అభ్యర్థించినా పట్టించుకోలేదని తెలిపారు.

అభ్యర్థులు గ్రూప్ నియామకాల కోసం 2011 నుంచి నిరీక్షిస్తున్నారని వివరించారు. త్వరలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నందున దీనిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదనల నిమిత్తం విచారణ ఈ నెల ౩కు వాయిదా పడింది.