15-04-2025 10:30:20 PM
హైద్రాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను టీజీపీఎస్సీ మంగళవారం ఖండించింది. తెలంగాణలోని మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ కు 21,0293 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా గత కొద్దిరోజుల క్రితం వెలువడిన గ్రూప్-1 ఫలితాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మూల్యాంకనంపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చింది. పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకేలా మార్కులు రావడం సహజమే అని, గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం ప్రొటోకాల్ ప్రకారమే జరిగిందని టీజీపీఎస్సీ పేర్కొంది.
రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని తప్పుడు ఫిర్యాదు చేసిన అభ్యర్థికి నోటీసులు ఇచ్చామని టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. ర్యాంకులు రాని కొందరు అభ్యర్థులు, కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అభ్యర్థులు అలాంటి ప్రచారాలను నమ్మొద్దని, టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని టీజీపీఎస్సీ వెల్లడించింది.