calender_icon.png 29 April, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీల్

29-04-2025 01:09:14 AM

  1. భర్తీని తాత్కాలికంగా ఆపాలంటూ ఇటీవల సింగిల్ బెంచ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
  2. ఈ నిర్ణయంపై అప్పీల్ దాఖలు చేసిన టీజీపీఎస్సీ
  3. నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనం 
  4. హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులు
  5. 20 వేల జరిమానా విధించిన ఉన్నత న్యాయస్థానం
  6. బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు బెంచ్ ధర్మాసనం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

గ్రూప్ -1 నియామకాల్లో అవకతవకలు జరిగాయం టూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనం సరిగా చేపట్టలేదని, ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపుల్లోనూ రూల్స్ పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. భర్తీని తాత్కాలికంగా ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ధ్రువపత్రాల పరిశీల నకు మాత్రం అవకాశం కల్పించారు. టీజీపీఎస్సీ ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సోమవారం జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేశారు.

పిటిషనర్లకు హైకోర్టు జరిమానా

తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రూ.20 వేల జరిమానాతో పాటు, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది హైకోర్టును ఆశ్రయించారు. తమ మెమోలను, వెబ్‌సైట్‌లోని మార్కులతో పోల్చుకుంటే తేడాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పునఃమూల్యకనం చేపట్టి పారదర్శకంగా మార్కులు వెల్లడించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పేర్కొన్నారు. పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.