calender_icon.png 25 November, 2024 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్‌లో టీజీసీఎస్బీ స్పెషల్ ఆపరేషన్

25-11-2024 12:14:39 AM

8.14 కోట్లుకాజేసిన కేసులోసైబర్ నేరస్తుడి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని మోసగించి రూ.8.14 కోట్ల సైబర్ మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ సమకూర్చిన రాజస్థాన్, చిత్తోర్‌గఢ్‌కు చెందిన శర్వణ్‌కుమార్ శర్మ అలియాస్ శ్రవణ్‌కుమార్ శర్మ అలియాస్ సత్యనారాయణ శర్మ(43)ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖాగోయాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత నెలలో బంజారాహిల్స్‌లో నివాసముండే వ్యక్తికి ట్రేడింగ్ నిపుణులమంటూ పేర్కొం టూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.  మాయమాటలతో బాధితుడిని ట్రేడింగ్ ఉచ్చులో దింపారు. అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి బ్లాక్ ట్రేడర్స్‌తో పాటు పలు ఐపీవోలలో పెట్టుబడులు పెట్టించారు. ఇలా పలు దఫాలుగా బాధితుడితో మొత్తం రూ.8.14 కోట్లు పెట్టుబడి పెట్టించారు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్‌పీ) పోర్టల్ ద్వారా.. బాధితుడు పంపిన డబ్బులో రాజస్థాన్‌కు చెందిన శర్వణ్‌కుమార్‌కు చెందినహరిహర్ ఎంటర్ ప్రైజెస్‌కు చెందిన కరెంట్ బ్యాంక్ ఖాతాలో రూ. 27 లక్షలు జమైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టీజీసీఎస్బీ ప్రత్యేక బృందం రాజస్థాన్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించింది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.