- సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 48 మంది అరెస్ట్
- దేశవ్యాప్తంగా 2,194 కేసులు, రూ.8.16 కోట్ల లావాదేవీలు
- వివరాలు వెల్లడించిన టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 48 మందిని అదుపులోకి తీసుకు న్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్ తెలి పారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కం ట్రోల్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో తొలిసారిగి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నట్లు చెప్పారు. టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుల సాయంతో వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించి, సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మొత్తం 48 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
పట్టుబడిన నిందితుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా 508 సైబర్ క్రైమ్ కేసులుండగా, దేశవ్యాప్తంగా 2,194 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ 48 మందికి సంబంధించిన మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించామని.. ఆయా ఖాతాల్లో రూ.8.16 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు.
కమీషన్ ఆశతో మ్యూల్ ఖాతాలు..
రాష్ట్రంలో వివిధ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న 48 మంది నిందితులు కమీషన్ ఆశతో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చడం ప్రవృత్తిగా చేసుకున్నారు. ఒక్కో లావాదేవీకి కొంత మొత్తం కమీషన్ అందుకుంటూ, క్రిప్టో కరెన్సీ పద్ధతిలో వారికి డబ్బు చేరవేసేవారని విచారణలో గుర్తించారు.
మ్యూల్ ఖాతాల లావాదేవీలకు సం బంధించి బ్యాంకు అధికారుల ప్రమేయం ఉందని తెలితే వారిపై కూడా చట్టపర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుల నుంచి 53 సెల్‌ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు, 5 సీపీయూలు, 2 మానీటర్లు, 18 బ్యాంకు ఖాతాలు, 16 చెక్కు బుక్కులతో సహా 10 ఏటీం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ విజయవంతం అవ్వడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, టెక్నికల్ టీమ్‌ను శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు.