- 795 సైబర్ కేసులతో సంబంధమున్న 165 స్కామర్ల అరెస్ట్
- అప్రమత్తంగా ఉండాలి: టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పంజా విసురుతోంది. సైబర్ నేరాలను అరికట్టడానికి గత ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ (సీసీపీఎస్)లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
గడిచిన ఆరు నెలల్లో మొత్తం 165 మంది స్కామర్లను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరంతా స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, వ్యక్తిగత రుణాలు, సెక్స్‌టార్షన్ వంటి వాటితో బాధితులను భయబ్రాంతులకు గురి చేసి అందినంతా దోచుకున్నారని లిపారు. ముఖ్యంగా అస్సాం, న్యూఢిల్లీ, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల వారు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
నిందితుల్లో కొంతమంది నేరుగా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా, మిగతా వాళ్లు నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు, సిమ్ కార్డులు వంటి వాటిని సమకూరుస్తున్నారని వివరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, మేసేజ్‌లకు స్పందించవద్దని తెలిపారు.