calender_icon.png 14 November, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో కుటుంబ స‌ర్వే

13-11-2024 08:14:29 PM

జిల్లా క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్‌

రామాయంపేట‌,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్, తహ‌సిల్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల కుటుంబాలకు గాను 1600 మంది ఎన్యూమరేటర్స్, 170 మంది సూపర్వైజర్, నియమించుకొని సర్వే ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 33 శాతం సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో పది రోజులలో చివరి దశకు చేరుకుంటుందని చెప్పారు. ప్రజలందరూ ఎటువంటి సందేహాలకు గురికాకుండా, నిరభ్యంతరంగా కుటుంబ సర్వే వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వే ఫారంలో ప్రధాన ప్రశ్నలలో ఎలాంటి సమస్య ఎదురైన వెను వెంటనే ఎన్యూమరేటర్స్, సూపర్ వైజర్లు మరింత సమాచారం తెలుకోవడం కోసం ప్రణాళిక శాఖ నుండి అందించినటువంటి ఎన్యూమరేటర్స్ మార్గదర్శకాల పుస్తకంలో చూసుకోని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని తెలిపారు.

క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించడానికి మున్సిపల్ కమిషనర్, తహ‌సిల్దార్ మండల అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుందని 40 సెంటర్లకు గాను ట్యాగింగ్ చేయడం జరిగిందని, డిఫాల్ట్ మిల్లర్స్ 25 శాతం పెనాల్టీ కట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. మిల్లర్స్ కూడా ముందుకు వచ్చినట్లు చెప్పారు. త్వరలో ఇంకా 40 మిల్లులు అందుబాటులోకి వస్తాయని, కొనుగోలు వేగం పుంజుకుంటుందని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం భద్రపరచడానికి కొన్ని గోడౌన్స్ కూడా అందుబాటులోకి ఉంచామన్నారు. వాతావరణ అసమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు సెంటర్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పలిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

జిల్లాలో ఈసారి ధాన్యం ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు ఇతర జిల్లాలకు తరలించేందుకు కమిషనర్ సివిల్ సప్లై వారికి అలాట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోలు సమస్యలు ఉన్నట్లయితే  వెంటనే సమస్యల నివృత్తికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 9281103685 నెంబర్  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ కమిషనర్,దేవేందర్, తహ‌సిల్దార్ ర‌జ‌నీ కుమారి, సంబంధిత ఎన్యూమ‌రేట‌ర్లు పాల్గొన్నారు.