హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ సపోర్టును కూడా తొలగించారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు బుధవారం కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. శ్రీతేజ్ ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడని దిల్ రాజు వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలతో కలవబోతున్నామని దిల్ రాజు తెలిపారు. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై భేటీలో చర్చిస్తామని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీకి.. ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటానని స్పష్టం చేశారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప-2 చిత్ర బృందం రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి అయిన చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించిన అనంతరం ప్రకటించారు. రూ.2 కోట్ల ఆర్థిక సాయంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వగా, పుష్ప-2 చిత్ర నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇచ్చారు. దిల్ రాజుకు రూ.2 కోట్ల చెక్కును అందించినట్లు అరవింద్ తెలిపారు. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగడంతో శ్రీతేజ్ గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ తొక్కిసలాటలో బాలుడి తల్లి రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి థియేటర్ యజమాని, సీనియర్ మేనేజర్, మేనేజర్‌తో పాటు ఆల్ అర్జున్‌ని అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ పొందడంతో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.