ఓరుగల్లు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - 2050
గ్రేటర్ వరంగల్ అభివృద్ధి సమీక్షలో సీఎం రేవంత్
నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్
రింగ్ రోడ్డుకు సత్వరమే భూ సేకరణ
స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలి
అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై రిపోర్టివ్వండి
వర్షాలకు ఇబ్బందులు ఉండొద్దు
సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు వేగం పెంచాలి
అంచనాల విలువ పెంపుపై రిపోర్ట్ ఇవ్వండి
కాళోజీ కళాక్షేత్రం త్వరగా పూర్తి చేయాలి
నిమ్స్ మాదిరిగా ఎంజీఎంకు ఎన్‌వోసీలు
వరంగల్ అభివృద్ధికి 6,115 కోట్లు
హనుమకొండ, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇకపై తాను వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఎనిమిది అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు.
రింగ్ రోడ్డు నిర్మాణం, స్మార్ట్ సిటీ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, మామూనూర్ విమానాశ్రయం పరిస్థితి, కాళోజీ కళాక్షేత్రం పనులు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రత్యేక జోన్‌గా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. మొదట రింగ్ రోడ్డు నిర్మాణంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.
వరంగల్ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050
వరంగల్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ 2050కు డిజైన్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉన్న నిలోఫర్ దవాఖాన మాదిరిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో లేదో తెలుసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 9 నాటికి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలకు నిమ్స్‌లో అందిస్తు న్నట్లుగా ఎంజీఎం దవాఖానలో ఎన్‌వోసీ ఇచ్చే అంశంపై పరిశీలన జరుపుతామని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో సర్జరీల వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామని చెప్పారు.
రింగ్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేయాలి
వరంగల్ నగరం చుట్టూ రెండు ఫేజ్‌లలో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్‌రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు మునుగుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని, నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. నాలాల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్‌లో ప్రయోగించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై సవివరమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వర్షం కురిసినప్పుడు ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనుల అంచనా వ్యయం ఎందుకు పెరిగిందని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఈపీసీ పద్ధతిన పనులు చేపడుతున్నందున ఆవిధంగా పెంచే వీలు లేదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వశక్తి సంఘాలను మరింత బలోపేతం చేస్తాం
స్వశక్తి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉంటే వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫాంలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించే అవకాశం ఉందని, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమగ్రంగా సమావేశం నిర్వహిస్తారని సీఎం చెప్పారు. ఇందులో సమగ్ర వివరాలతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధికి రూ.6,115 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. అనంతరం స్వశక్తి మహిళలకు రూ.518 కోట్ల 71 లక్షల 20 వేల చెక్కును అందజేశారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని, సుపరిపాలని అందించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన కోరారు. వరంగల్ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. వరంగల్‌కు వారసత్వంగా గొప్ప పేరుందని, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారులు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని, వారి సమర్ధత ఆధారం గానే బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
రాజకీయ ప్రేరేపిత బదిలీలు ఉండబోవని, అధికారులు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాంచంద్రు నాయక్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కే ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్విని, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
టెక్స్‌టైల్ పార్కుకు భూమిలిచ్చినవారికి ఇందిరమ్మ ఇండ్లు
కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట సమీపంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను శనివారం ఆయన సందర్శించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి లోగోను ఆవిష్కరించి మొక్కలు నాటి నీరు పోశారు. టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించడంతోపాటు పనుల పురోగతిపై అధికారులు, కిటెక్స్, యంగ్ వన్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పార్క్‌లో ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు పనులు ప్రారంభమయ్యాయి? ఎంత మందికి ఉపాధి లభిస్తున్నది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్క్ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలకు ప్లాట్లతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ౧౨౦౦లకు పైగా ఇండ్లు నిర్మిస్తే గ్రామ పంచాయతీ ఏర్పాటుచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో వరద నీటిని నిలువ చేసేందుకు చెరువును నిర్మించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉండే ఇతర చెరువులతో పార్క్ చెరువును అనుసంధానం చేయడం ద్వారా వదర నీటి సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతకుముందు సీఎంకు టెక్స్‌టైల్ పార్కు వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ తదితరులు స్వాగతం పలికారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ వ్యయంపై సీఎం సీరియస్
వరంగల్ పర్యటనలో భాగంగా సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా రూ.1100 కోట్ల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ1,726 కోట్లకు పెంచడం ఏంటని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు లేకుండా మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్లు ఎలా పెంచుతారని నిలదీశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం సరికాదని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు తేల్చిచెప్పారు.
హెల్త్ టూరిజం హబ్‌గా వరంగల్
వరంగల్‌ను హెల్త్, ఎకో టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. హనుమకొండ హంటర్ రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడికవర్ దవాఖానను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యరంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ దవాఖాన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్య వైద్యం, విద్యత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేయాని ప్రభుత్వ నిర్ణయించినట్టు తెలిపారు.