మొదటిరోజే పాఠ్య పుస్తకాలపంపిణీకి ఏర్పాట్లు
బడులు తెరుచుకోక ముందే పుస్తకాలు చేరేలా చర్యలు
హైదరాబాద్ నుంచి గోదాములకు బుక్స్
హైదరాబాద్, మే11 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం బడి పునఃప్రారంభం కంటే ముందే సరిపడా పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసు కుంటున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు, ఆ తర్వా త గ్రామాల నుంచి ఆయా పాఠశాలలకు పా ఠ్యపుస్తకాలు చేరుతున్నాయి. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలను సరఫరా చేసేలా అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు పుస్తకాలు చేరుతున్నాయి.
గోదాముల్లో నుంచి జిల్లాలకు
రాష్ట్రంలో దాదాపు 27వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2023 ప్రకారం 25,80,291 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నారు. వీరికి మొత్తం 1,49,74,691 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, గత విద్యాసంవత్సరంలో 6,64,150 పాఠ్యపుస్తకాలు మిగిలాయి. అయితే, ఇవి పోను ఇంకా 1,43,11,141 పుస్తకాలు కావాల్సి ఉంది. అయితే, ఇప్పటి వర కు జిల్లాలకు 36,77,630 పుస్తకాలు మాత్ర మే చేరాయి. ఇంకా 1,06,33,511 పుస్తకాలు జిల్లాలకు చేరాల్సి ఉంది. జిల్లాలకు చేరే పుస్తకాలను గోదాముల్లో ఉంచి అక్కడి నుంచి పాఠశాలలకు తరలిస్తున్నారు.
20 నుంచి 30 శాతం పూర్తి
పాఠ్యపుస్తకాలను సకాలంలో జిల్లాలకు చేరవేసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు కలిపి సగటున 26 నుంచి 30 శాతం వరకు పుస్తకాలు చేరినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా పుస్తకాలను రవాణా చేస్తున్నారు. గతంలో పాఠ్యపుస్తకాలను ఒకే మీడియంలో ప్రింట్ చేసేవారు. గత ఏడాది నుంచి పుస్తకాలను ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్ మీడియం భాష ల్లో బైలింగ్విల్‌గా ముద్రిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలవుతుండటంతో విద్యార్థులకు అర్థంకాని విష యాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదువుకునేలా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అలా గే పాఠ్యపుస్తకాలపై ఉండే క్యూఆర్ కోడ్ స్కా న్ చేయగానే పాఠ్యాంశాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేలా రూపొందించారు.
మేడ్చల్ జిల్లాకు అతి తక్కువగా..
అధికారిక లెక్కల ప్రకారం, 33 జిల్లాలకు పుస్తకాలు 26 శాతం వరకు మాత్రమే చేరా యి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాకు 6 శాతం, రంగారెడ్డి జిల్లాకు 10 శాతం, జయశంకర్ భూపాలపల్లికి 12 శాతం, మహబూబాబాద్, హన్మకొండకు 14 శాతం పుస్తకాలు చేరాయి. ఇక ఆదిలాబాద్‌కు 47 శాతం, నిర్మల్ జిల్లా కు 48 శాతం, నిజామాబాద్‌కు 43 శాతం, వనపర్తి జిల్లాకు 38 శాతం చేరితే మిగిలిన జిల్లాలకు 20 నుంచి 30 శాతం వరకు పుస్తకాలు చేరాయి. ఇంకా 1.43 కోటి లక్షల పుస్త కాలు జిల్లాలకు చేరాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ పుస్తకాలను చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.