డా.ముదిగంటి సుజాతా రెడ్డి :
కాళోజీ సోదరులు, వట్టికోట ఆళ్వారు స్వామి, దేవులపల్లి రామానుజరావు, వానమామలై వరదాచార్యులు, పి.వి. నరసింహారావు, దాశరథి వంటి సమకాలిక రచయితలతో పొట్లపల్లి రామారావు పరిచయాలు పెంచుకున్నాడు. ఇంట్లో సాహిత్య వాతావరణం లేదు. ‘ఆయన సాహిత్యాభిమానం ఆస్తిని తెచ్చిపెడ్తుందా ఏమి?’ అని హితులు, బంధువులు ప్రోత్సాహం ఇయ్యకున్నా, పొట్లపల్లి సహజ ఆకాంక్షతోనే చదవటం, వ్రాయటం చేసాడు. ఆధునిక కవిత్వం, కథ, నాటికలు, వ్యాసాలు, ఊహాచిత్రాల వంటి వివిధ ప్రక్రియలపట్ల లోతయిన అవగాహనతో రచనలు చేసాడు.
తెలంగాణలో ఒక ఫ్యూడల్ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పొట్లపల్లి రామారావు సంప్రదాయ పండితుల దగ్గర చదువుకొని పాండిత్యం సంపాదించినవాడు కాదు. ఉర్దూ మీడియంలో చదివి ఆనాటి రాజభాష పార్శీ భాషను కొంతవరకు నేర్చుకున్నాడు. మాతృభాష తెలుగు అంటే అభిమానం. అందుకే తెలుగులోనే కవిత్వం వ్రాసాడు. తెలుగులోనే వచన రచన చేసా డు. ఆయన వచనంలో కథలు, హాస్యగల్పికలు, నాటికలు, వ్యాసాలు, ఉపచిత్రాలు గల్పికలు, స్కెచ్ ల వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసాడు. పేరు పెట్టకుండానే ఒక నవలను వ్రాయటానికి పూనుకున్నాడు. దాన్ని ఏ కారణం చేతనో పూర్తి చేయలేక పోయాడు. పూర్తి చేస్తే ఆ కాలంలో నిజాం రాజ్యం లో వున్న ‘ఆడబాపల’ జీవిత వ్యథను చిత్రించిన మంచి నవల అయ్యేది. ఆ అసంపూర్ణ నవలకు ఈ సంపుటి సంపాదకుడు భూపాల్‌రెడ్డి ‘నీలవేణి’ అని పేరు పెట్టాడు.
‘సైనికుని జాబులు’ పేరుతో సైన్యంలో చేరిన ఒక సైనికుడు తన భార్యకు వ్రాసినట్లుగా పొట్లపల్లి నాలుగు ఉత్తరాలను వ్రాసాడు. అవి 1947 మే, జూన్, జులై, ఆగస్టు ‘శోభ’ పత్రికలో అచ్చయ్యాయి. శోభ పత్రికను దేవులపల్లి రామానుజరావు వరంగల్ నుంచి నడిపాడు. ఈ సైనికుని నాలుగు జాబు ల్లో, ఒక సైనికుని జీవితం, చిత్తవృత్తి ఎట్లా వుంటుందో ప్రతిబింబించింది.
పొట్లపల్లి రామారావు కవిత్వం తర్వాత, కథాప్రక్రియలో మంచి రచనలు చేసాడు. తెలంగాణ నుంచి తెలుగు కథారంభ దశలో కథలే రాలేదనే వాళ్ళకు పొట్లపల్లి కథలు కూడా ఒక సమాధాన మే. తెలంగాణలో కవిత్వం, పాట తర్వాత ‘కథ’ ప్రక్రియ 1910 దశకంలోనే ఆరంభమై వికసించిం ది. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాయుధ పోరాట చరిత్రలను రికార్డు చేసింది. పొట్లపల్లి రామారావు కథల్లోనూ నిజాం పాలనలో జరిగిన దొరల, జమిందారుల, ప్రభుత్వోద్యోగుల దౌర్జన్యా లు, హింసాపూరిత నేరాలు, దోపిడీలు చాలా వాస్తవికంగా చిత్రింపబడినాయి. ఆ కాలంలోనే తెలుగు పాఠకుల కోసం ‘అణా గ్రంథమాల’ స్థాపించబడింది. మాడపాటి, సురవరం, కాళోజి వంటి విశిష్ట రచయితల కథలను పుస్తకాలుగా గ్రంథమాలవారు ప్రచురించారు. అదే సమయంలో పొట్లపల్లి రామారావు రచించిన ఎనిమిది కథలను ‘జైలు’ పేరుతో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీవారు 1945లో పుస్తకంగా అచ్చువేశారు. పొట్లపల్లి రచనలు ఆ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రకేసరి, తెలుగు తల్లి, అభ్యుదయ, స్రవంతి, శోభ మొదలైన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే పత్రికల్లో అచ్చయ్యాయి. ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే పత్రికలు తెలంగాణ రచయితల రచనలను సాధారణంగా అచ్చు వేసేయి కావు. ఈ విషయాన్ని గురించి సురవరం వారు గోలకొండ పత్రికలో సంపాదకీయం కూడా వ్రాసారు. ఆధునిక కాలం వరకు, అంటే మొన్న మొన్నటి వరకు ఈ వివక్ష కొనసాగుతూనే వుండింది. భాష, వస్తువు విషయంలో వాళ్ళకు తెలంగాణ కథలు వింతగా అనిపించేవేమో తెలియ దు. ఒకటి- భాష: ఇక్కడ తెలుగు తెలంగాణ యాస, నుడికారాలతో వుండేది. నిజాం పాలనలో నాలు గు గోడల మధ్య వున్నట్టుగా తెలంగాణ ప్రజలున్నారు. కాబట్టి వాళ్ళ భాష ఇతర తెలుగు ప్రాంతా లవారికి కొత్తగా, వింతగా తోచింది. రెండోది- వస్తువు, తెలంగాణ జీవితం. మధ్యయుగాల నాటి ఫ్యూడల్ వ్యవస్థతో కూడిన జీవితం. దొరలు, జమిందారుల పెత్తనం. దోపిడి. బీద రైతులను, బీద ప్రజలను అన్ని విధాల దోచి, వాళ్ళు నిజాంకు ఇచ్చేవారు. నిజాం చివరి దశలో బ్రిటీషువాళ్ళను సంతృప్తి పరుస్తూ వాళ్ళ మెప్పును పొందేవాడు. ఆ విధంగా నిజాం రాజ్యంలో దోపిడి ఎన్నో పొరలుగా కొనసాగుతూ వుండేది. అటువంటి దోపిడి, అన్యాయాలను, జులుంను పొట్లపల్లి రామారావు తన కథల్లో, నాటికల్లో చాల వాస్తవికంగా చిత్రించాడు. నిజాం కాలంలో తెలంగాణలో పనిపాటల వాళ్ళు, జీతభత్యాలు లేకుండా దొరలకు వెట్టి చాకిరి చేయటం వుండేది. సావుకారు, పుణ్యానికి సరుకులు సరఫరా చేయాలి. ఊర్లలోకి దౌరాలకు- అధికారిక పర్యటనలకు -వచ్చే పోలీసు, ప్రభుత్వోద్యోగుల సేవల, సౌకర్యాల కోసం ఊరి ప్రజలం దరు కదలవలసి వచ్చేది. ‘న్యాయం’ అనే కథలో పొట్లపల్లి, వెట్టి చాకిరి చేసే మాదిగ జీవితం ఎంత దైన్యంగా వుండేదో చాల సహజంగా చిత్రించాడు. పొట్లపల్లి రామారావు కాంగ్రేసు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకు పోయాడు. అందుకే జైలు జీవితాన్ని, అమాయాకుల మీద నేరాలు మోపే విధానాన్ని ‘జైలు’ అనే కథలో అద్భుతంగా చిత్రించాడు.
‘సమాధి స్థలము’ కథలోని ఇతివృత్తం ఇప్పటికీ సందర్భంగా వుంది. రాజకీయ నాయకుల సమాధుల కోసం ఎకరాల కొద్ది భూములను కేటాయిం చటం నేటికీ వుంది. ధనవంతుల, అధికారుల భూ ఆక్రమణలు పేదవాళ్ళకు, శవాన్ని పాతి పెడదామన్నా భూమి దొరకక పోవటం వంటి దుస్థితిని చిత్రిస్తున్న మంచి కథ ఇది.
‘జైలు’ సంపుటంలో వున్న ఎనిమిది కథలుకాక పొట్లపల్లి రామారావు మీద పరిశోధన చేసిన భూపాల్‌కు మరో పద్నాలుగు కథల వరకు దొరికాయి. మొత్తం 22 కథలు ఈ గ్రంథంలో చేర్చబడి నాయి. ‘స్వేచ్ఛ’ కథ 1957లో ’స్రవంతి’లో అచ్చయింది. ఈ కథలో, ఆ రోజుల్లో పల్లెటూరి బడుల పరిస్థితి ఎట్లా వుండేదో రచయిత చిత్రించాడు. బడిలో పంతులు చెప్పే చదువు తక్కువ. పిల్లలతో పంతులు అన్ని రకాల చాకిరి చేయించుకునే వాడు. పంతులుకు తన వంట చింతే కానీ పిల్లలకు చదు వు చెప్పాలనే ఆలోచన తక్కువ. పిల్లలు అల్లరి చేస్తే కఠిన శిక్షలు వేసేవాడు. బడి ఒక జైలులా వుండేదంటాడు పొట్లపల్లి. బడి అంటే పిల్లలకు ‘స్వేచ్ఛ’ వుండాలని ఆయన అభిమతం. అందుకే కథ పేరు ‘స్వేచ్ఛ’ అని పెట్టాడు. ‘వెన్న’ వంటి రచనలు ‘స్కెచ్’లలా వుంటాయి. ‘మా గ్రామము’, ‘మా వూరికి ఆహ్వానము’ వంటి రచనలు ఊరి వర్ణనలతో కథ కన్నా ‘ముచ్చట’లాగా వున్నాయి.
ఈ గ్రంథంలో పొట్లపల్లి రచించిన ‘ముల్లాకథ లు’, ‘ఆచార్యులవారి కథలు’ వున్నా యి. ఈ హాస్యకథలు కొన్ని 1945లో మద్రాసు నుంచి వెలువ డిన ‘ఆనందవాణి’ పత్రికలో అచ్చు అయ్యాయి. లోకంలో వ్యాప్తిలోవున్న ఆరేబియా ప్రాంతపు కథలను తీసుకునే పొట్లపల్లి ఈ లఘు హాస్యకథలను వ్రాసి వుంటాడు. ఈ కథల్లో పొట్లపల్లి కథనం సరళంగా, చదివించేటట్లుగా వుంది.
పొట్లపల్లి స్వయంకృషితోనే రచనలు చేసాడని చెప్పాలి. సంప్రదాయ విద్యనభ్యసించలేదు. ఆధునిక విద్యను చదువుకోలేదు. ఆయనకు పుస్తకాలం టే ప్రీతి. ఎన్నో పుస్తకాలు చదివేవాడు. టాల్‌స్టాయ్, చెహోవ్ మొదలైన కథకుల కథలు చదివి ప్రేరణ పొందాడు. కాళోజీ సోదరులు, వట్టికోట ఆళ్వారు స్వామి, దేవులపల్లి రామానుజరావు, వానమామలై వరదాచార్యులు, పి.వి. నరసింహారావు, దాశరథి వంటి సమకాలిక రచయితలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇంట్లో సాహిత్య వాతావరణం లేదు. ‘ఆయన సాహిత్యాభిమానం ఆస్తిని తెచ్చిపెడ్తుందా ఏమి?’ అని హితులు, బంధువులు ప్రోత్సాహం ఇయ్యకున్నా, పొట్లపల్లి సహజ ఆకాంక్షతోనే చదవటం, వ్రాయటం చేసాడు. ఆధునిక కవిత్వం, కథ, నాటికలు, వ్యాసాలు, ఊహాచి త్రాల వంటి వివిధ ప్రక్రియలపట్ల లోతయిన అవగాహనతో రచనలు చేసాడు.
కథల్లో పొట్లపల్లి రామారావు శైలిచాల సరళంగా, వాడుక భాషకు దగ్గరగా వుంది. కథన శిల్పం బాగుంది. చిన్న కథ లేక ‘కథానిక’లో ఇతివృత్తం చిన్నదిగా వుండాలనే సూత్రాన్ని పొట్లపల్లి అక్షరాలా పాటించాడు. చిన్న కథతోనే తాను చెప్పదలచుకున్న విషయాన్ని, అనవసరమైన వర్ణనలు, అంశాలు లేకుండా వ్రాసాడు. భాషలో తెలంగాణా యాస, నుడి కారాలున్నాయి.
పొట్లపల్లి రామారావు నాలుగు నాటికలు వ్రా సాడు. నాలుగు నాటికలు కూడా వస్తు వైవిధ్యంతో అపూర్వంగా వున్నాయి. నాల్గింటిలో మూడు నాటికల్లో, నిజాం కాలం నాటి సామాన్యుల జీవితం ఎంత దుర్భరంగా వుండేదో చాలా వాస్తవికంగా చిత్రించాడు. నాటికలలో సంభాషణలు సుదీర్ఘంగా లేకుండా, చకచకా నడుస్తాయి. ఎక్కడా, ఏ సన్నివేశమూ విసుగు పుట్టించేదిగా లేదు. పాత్రలు రక్తమాంసాలున్న మనుషులుగా కన్పిస్తాయి. వాళ్ళ సంభాషణలు పాత్రోచితంగా వున్నాయి.
‘సర్‌బరాహి’ నాటికలో ఊరి దొర, ఊరి ప్రజల బర్రెలను పట్టి తెప్పించి ఎట్లా స్వంతం చేసుకుంటాడో చక్కని సంభాషణలతో, సన్నివేశాలతో మన కన్నుల ముందు జరుగుతు న్నట్లుగా చిత్రింపబడింది. దొర, పేరమ్మ అనే పేదరాలి బర్రెను, దుడ్డె ను (దూడను) బలవంతంగా తెప్పించుకొని తన దొడ్లో కట్టించేసుకుంటాడు. కానీ రాత్రి ఆ రెండూ తాళ్లను తెంపుకొని పేరమ్మ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా దొరకు భంగపాటు కలుగుతుంది.
‘పగ’ నాటికలో, నరసింహారెడ్డి అనే తిరుగుబా టు దారుడు ‘రాబిన్ హుడ్’ లాగా కష్టాల్లో వున్న ప్రజలను కాపాడుతుంటాడు. ఆఖరికి నరసింహారెడ్డి పోలీసులకు చిక్కుతాడు. పోలీసులు అతన్ని చిత్రహింసలు పెడ్తారు. అతడు పోలీసుల కండ్లల్లో కారం చల్లి పారిపోతాడు. పొట్లపల్లి రామారావు కాంగ్రెసులో వుండి, గాంధేయవాది అయినా కమ్యూనిస్టుల భావజాలాన్ని సమర్థించాడు. పేదల కష్టాలకు చలించాడు. దొరల, అధికారుల దౌర్జన్యాలను, దోపిడీలను నిరసించాడు. ప్రజల పక్షాన నిలబడ్డాడు. స్వయంగా దొరల కుటుంబంలో జన్మించినా, పేదల కష్టనష్టాలకు స్పందించాడు.
ఈ నాలుగు నాటికలను పొట్లపల్లి ‘సెప్టెంబ రు 1945 ఆగస్టు 1949’ మధ్య కాలంలో రచించాడు. ‘సర్‌బరాహి’ సెప్టెంబర్ 1945, ‘పగ’ మే 1948, ’పాదధూళి’ ఆగస్టు 1948, ‘న్యాయం’ ఆగ స్టు 1949లో రచించాడు. ఇవి ’విశాలాంధ్ర, అభ్యుదయ’ వంటి ప్రసిద్ధ పత్రికల్లో అచ్చయ్యాయి.
మూడో నాటిక ’పాదధూళి’లో, గాంధేయవాది అయిన పాట్లపల్లి గాంధీజీ ఒక గ్రామాన్ని సందర్శించటాన్ని చిత్రించాడు. ఆ గ్రామంలో ఉద్యమ కారుల మీద పోలీసులు కాల్పులు జరుపగా, దేశం కోసం కొంతమంది ప్రాణాలుత్యజిస్తారు. అట్లాంటి అమరవీరుల భార్యాపిల్లలు కటిక దారిద్య్రంలో వుంటారు. కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి వుండదు. ఒక అమరుడైన స్వాతంత్య్రోద్యమకారుని కొడుకు, గుంపులో వున్న గాంధీజీని ఎంతో కష్టపడి చేరుకుంటాడు. గాంధీని తన గుడిసెకు, తల్లి దగ్గరకి తీసుకొని వస్తాడు. గాంధీజీ చుట్టూ, దేశం కోసం త్యాగం చేసినవాళ్ళు కాక మఖ్ఖన్‌లాల్, దులారీరామ్ వంటి స్వార్థపరులు, పెట్టుబడిదారులు చేరారని పొట్లపల్లి ఈ నాటకంలో చిత్రిం చాడు. ఆగస్టు 1948లో వ్రాసిన ఈ నాటిక గాంధీ జీ హత్యకు ఐదు నెలలు పూర్వం వ్రాసింది. అప్పటికింకా తెలంగాణా కు స్వాతంత్య్రం రానేలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే రాజకీయాల్లో చేరిన స్వార్థపరులను, పదవీకాంక్ష కలవారిని పొట్లపల్లి గమనించి వుంటాడు. దేశం ఒకవైపు దారి ద్య్రంలో వుంటే, అమరులైన వాళ్ళ కుటుంబాలు కష్టాలపాలు కాగా, ఇంకోవైపు గాంధీజీ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని ఉపయోగించుకునే వాళ్ళు తయారయ్యారన్న స్వార్థ రాజకీయాల సత్యాన్ని పొట్లపల్లి ఈ నాటికలో చాలా బాగా చిత్రించాడు. ఆ సమయంలోనే, ఆ పరిస్థితుల్లోనే వామపక్ష భావజాలం రామారావును ఆకర్షించి వుంటుంది.
పొట్లపల్లి నాల్గవ నాటిక ‘న్యాయం’ ఆగస్టు 1949లో వ్రాసింది. అప్పటికింకా తెలంగాణా విమోచనం జరుగలేదు. ఊర్లోకి పోలీసు అమీను వస్తాడు. మల్లయ్య అనే గ్రామస్తుడు కోడిని దొంగలించాడనే నేరం కింద నాలుగు నెలలు జైలుశిక్ష అనుభవించాలని అమీను అంటాడు. ఈ విచారణ జరుగుతున్నపుడే ఒక జవాను ఊర్లోకి పోయి, ఒక ఎరకలవాని కోడిని, అమీనుకు వండి పెట్టాలని బలవంతంగా పట్టుక వస్తాడు. ఎరకలవాడు వచ్చి, అది దేవునికి మొక్కుకున్న కోడి అనీ, దాన్ని చంపవద్దని వేడుకుంటాడు. ‘మల్లయ్య కోడిదొంగ అయి తే, నా కోడిని పట్టుకవచ్చిన మీరు దొంగలు కారా? అన్యాయం న్యాయమై పోయింది’ అని ఎరకలవా డు ధైర్యంగా ప్రశ్నించటం ఈ నాటికలో రచయిత చూపిన కొత్త మలుపు. మొత్తం నాటిక పట్టుగా నడుస్తుంది. పొట్లపల్లి నాటికలలో సంభాషణలను చాలా పొదుపుగా వాడుకున్నాడు. ప్రతి పాత్ర మాటలూ బలంగా, వాస్తవికంగా వున్నాయి. ఈ నాటికలన్నీ ప్రదర్శనకు సుయోగ్యంగా వున్నాయి.
ఈ పుస్తకం చివర ‘గ్రామ చిత్రాలు’ పేరుతో పద్నాలుగు స్వగతాలు లేదా ఊహాచిత్రాల వంటి రచనలున్నాయి. పొట్లపల్లి భావుకత ఈ ఊహాచిత్రాలలో చాలా చక్కగా కన్పిస్తుంది. ఈ వ్యాసాల లో ఆయన కవితా హృదయం ఎంత సుకుమారమైందో, ఎంత మధురమైందో తెలుస్తుంది. వాస్తవి కతకు దూరం కాని మధురోహలు ఈ చిత్రాలలో కన్పిస్తాయి. ‘కూరపాదులు’ ఊహాచిత్రంలో, విత్తనాలు భూమిలో పడి మొలవటం దగ్గర్నుంచి అవి పెరిగి, పచ్చగా నిగనిగలాడుతూ, పిందెలు మొదలు కూరగాయల వరకు వర్ణన ‘కూరపాదుల’లో వుంది. మధ్యలో కలుపు మొక్కలు మొలవ టాన్ని జీవితసత్యంతో జోడించి చెప్తాడు.
‘ఊరు-వాన’లో, వర్షం వస్తే గ్రామాలలో వాతావరణమంతా ఎట్లా వుంటుందో చిత్రించాడు. పని వున్నవాళ్ళు, తడిసిన గుడ్డలతోనే వర్షంలో తిరగటం గురించి వ్రాశాడు. అట్లా ఊరిలో వాన పడు తుండగా తాను గమనించిన విషయాలన్నిటినీ రచయిత చెప్తాడు. ఆయన భావుకతేకాక ఆయన సూక్ష్మీక్షణ కూడా ఈ చిత్రాల్లో ప్రతిఫలించింది. ఒక ఫొటోగ్రాఫరు ఎట్లా ఫొటోలు తీస్తాడో, రచయిత ఆ విధంగా వివిధ దృశ్యాలను ఫొటోలుగా చూపిస్తాడు. ప్రతి దృశ్యాన్ని కమనీయంగా పాఠకుల చేత దర్శింపజేస్తాడు. ఒక ‘ఊహాచిత్రంలో, ’తేలుకాటు’ ఎట్లా వుంటుందో వర్ణించాడు. ప్రతి ఊహాచి త్రంలో మనకు దృశ్యాలు బొమ్మకట్టి కన్పించేటట్లుగా పొట్లపల్లి రామారావు రచించాడు. పదాల తో చిత్రాలు వేయటమంటే ఇదే!
రచనా కాలం: 13.04.2012
‘పొట్లపల్లి రామారావు’ సాహిత్యం, వచనం నుంచి..
ముందుమాట: సంక్షిప్తంగా...