calender_icon.png 30 September, 2024 | 1:58 AM

నవంబర్‌లో టెట్.. ఫిబ్రవరిలో డీఎస్సీ!

05-09-2024 04:00:00 AM

  • 5 నుంచి 6 వేల ఖాళీలతో డీఎస్సీ ప్రకటన 
  • విద్యాశాఖ అధికారుల కసరత్తు 

జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలుకు ప్రణాళిక 

ప్రస్తుత డీఎస్సీ పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త ప్రకటించబోతోంది. రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారిస్తోంది. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జాబ్ క్యాలెండర్‌ను పక్కగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మరో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేయనుంది.

నవంబర్‌లో టెట్, ఫిబ్రవరిలో డీఎస్సీ ప్రకటనలను విడుదల చేయబోతోంది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్ ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. టెట్ నిర్వహణ, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలపై అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియను అక్టోబర్ కల్లా పూర్తి చేసి నవంబర్‌లో టెట్ నోటి ఫికేషన్ వేయాలని అధికారులు యోచిస్తున్నారు. 

కొత్త ఏడాదిలో టెట్ ఎగ్జామ్

ఏడాదిలో రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారమే ఏడాదిలో రెండుసార్లు టెట్ నోటిఫి కేషన్ వేస్తోంది. ఈ ఏడాది మార్చి 14న టెట్ నోటిఫి కేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలను మే 20 నుంచి జూన్ 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలకు మొ త్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పేపర్ 85,996 మంది, పేపర్ 79,138 మంది హాజరయ్యారు. మరో టెట్ నోటిఫికేషన్‌ను నవంబర్‌లో జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్‌లో షెడ్యూల్‌లో ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షను 2025 జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 

5 వేల ఖాళీలు గుర్తింపు?

ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులతో జారీచేసిన డీఎస్సీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దుచేసి అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ఫైనల్ కీ విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. ఏ చిన్న పొరపాటు జరగకుండా తుది కీ విషయంలో జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు అధికారులు చెప్తున్నారు.

తుది కీని విడుదల చేసిన తర్వాత డీఎస్సీ మార్కులు, టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు. ఆ తర్వాత 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి నియమాక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా కొత్త డీఎస్సీని వేయనున్నారు. దాదాపు 5 వేల నుంచి 6 వేల ఖాళీలతో డీఎస్సీ వేసే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్‌లో పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు.

కీ విడుదలలో ఆలస్యమెందుకు?

డీఎస్సీ ఫైనల్ కీ విషయంలో వాయిదాల పర్వంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతవా రం రోజులుగా ఈ రోజు లేదా రేపు ఫైనల్ కీ అంటూ విద్యాశాఖ పేర్కొనడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు..రేపు అంటు డీఎస్సీ అభ్యర్థులను గందరగోళ పరచడం సరికాదని తెలిపా రు. డీఎస్సీ తుది కీని విడుదల చేసి, జిల్లాలవారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించాలని బీఎడ్ డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.