12-04-2025 01:01:52 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరణాత్మక నోటిఫికేషన్‌ను ఈనెల 15న విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి కావడం విశేషం.
తొలిసారి గతేడాది మే 20 నుంచి జూన్ 2 వరకు, రెండోసారి ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు జరిగాయి. ఇక మూడోసారి పరీక్షలు జూన్ 15 నుంచి 30 మధ్య జరుగనున్నాయి. ఉదయం సెషన్ 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి సాయంత్రం 4.30 వరకు కొనసాగుంది. 1- 5వ తరగతి వరకు బోధించే అభ్యర్థులు పేపర్-1, 6- 8 వరకు బోధించే అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ గడువు ఉంది. అభ్యర్థులు జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల ఫలితాలు ఇదే ఏడాది జూలై 22న వెలువడనున్నాయి. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇం టర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్-1, డిగ్రీ, బీఎడ్ చేసిన వారు పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారమే..
రాష్ట్రప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగానే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్‌లో టెట్ ఉం టుందని జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగానే నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహిస్తామని జాబ్‌క్యాలెండర్‌లో పేర్కొనగా, అభ్యర్థులు ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.