calender_icon.png 5 November, 2024 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 1 నుంచి 20 వరకు టెట్

05-11-2024 02:18:19 AM

  1. నేటి నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరణ
  2. మేలో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించనివారికి 
  3. ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం 
  4. ఫిబ్రవరిలో డీఎస్సీ?

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న ఏడాదిలోనే రెండోసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం విశేషం.

గత మే 20 నుంచి జూన్ 2 వరకు తొలిసారి టెట్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఏడాదిలో టెట్ 2024-2 నోటిఫికేషన్‌ను జారీచేసింది.

మంగళవారం నుంచి ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షల (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నారు. 

అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీలోపు టెట్ రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీ టెట్ చైర్‌పర్సన్ ఈవి నర్సింహా రెడ్డి తెలిపారు. మంగళవా రం నుంచి పాఠశాల విద్యా అధికారిక వెబ్‌సైట్‌లో మరింత సమాచారం పొందవచ్చని, డిటైల్డ్ నోటిఫికేషన్ బులిటెన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

పరీక్ష ఫీజు, ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందనే వివరాలను ప్రకటించనున్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడా దికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. దానికనుగుణంగా నే టెట్‌ను నిర్వహిస్తోంది. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు టెట్ నిర్వహించగా, ఇది పదోది.

అలాగే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదుసార్లు నిర్వహిస్తే ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు నిర్వహిస్తోం ది. కానీ, గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం డిసెంబర్‌లో టెట్ నోటిఫికేష న్ జారీచేసి జనవరిలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది.

రాసేది 2 లక్షలపైనే..

టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసినవారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. ఈసారి టెట్ పరీక్షను 2 లక్షల నుంచి 2.30 లక్షల మంది రాసే అవకాశం ఉంది.

మేలో నిర్వహించిన టెట్‌కు పేపర్ 99,961 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 1,86,428 మంది చేసు కున్నారు. పేపర్ పరీక్ష రాసిన వారు 85,996, పేపర్ రాసిన వారు 1,50,491 మంది ఉన్నారు. ఇందులో పేపర్ అర్హ త సాధించినవారు 57,725, పేపర్ 51,443 మంది ఉన్నారు. వీరిలో 10వేల మందికిపైగా ఇన్‌సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు.

వారికి ఫీజు లేదు!

మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. గతంలో ఒక పేప ర్ రాసినా, రెండు పేపర్లు రాసినా టెట్ ఫీజు రూ.400 ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేపర్ రూ.వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ.2వేలు వసూలు చేశారు. అయితే దీనిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది.

టెట్‌లో అర్హత సాధించని వారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ అప్పట్లో ప్రకటన చేసింది. ఎన్నికల కోడ్ కూడా ఉండడంతో దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు వారికి అవకాశం కల్పించనుంది. గత టెట్ లో అర్హత సాధించిన వారికి వచ్చే డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనుంది. అయితే నేడు విడుదల చేసే సమగ్ర నోటిఫికేషన్‌లో దీనిపై స్పష్టత రానుంది.

టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి

మేలో నిర్వహించిన టెట్‌కి ఒక్కో పేపర్‌కి  వెయ్యి ఫీజును నిర్ణయించడంతో అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందిపడ్డారని, కొత్త అభ్యర్థులకు ఆ ఫీజు తగ్గించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరిలో డీఎస్సీ?

కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగానే టెట్ నోటిఫికేషన్‌ను వేసింది. పరీక్షలను జనవరిలో నిర్వహిస్తామని అందులో తెలిపినట్లుగానే జనవరి 1 నుంచి 20 వరకు చేపట్టబోతోంది. ప్రభుత్వం టెట్‌ను నిర్వహిస్తున్నందున మరో డీఎస్సీ నోటిఫికేషనూ వేయనుంది.

జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఏప్రిల్‌లో పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఐదారు వేల టీచర్ పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీని చేపట్టే వీలుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసి, కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

మేలో నిర్వహించిన టెట్‌లో 

అర్హత సాధించిన అభ్యర్థులు

పేపర్-1 పేపర్-2

పరీక్షకు హాజరైనవారు 85,996 1,50,491

అర్హత సాధించినవారు 57,725 51,443

శాతం 67.13 34.18

2023లో టెట్ రాసింది, అర్హత సాధించిన వారు

పేపర్-1 పేపర్-2

రాసిన వారు 2,23,582 1,90,047

అర్హత 82,489 29,073

శాతం 36.89 15.30