calender_icon.png 28 February, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

28-02-2025 07:27:46 PM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డేవిడ్, అదనపు ఎస్. పి. ప్రభాకర్ రావు, ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తో కలిసి పోలీస్, రెవెన్యూ, విద్యా, గిరిజన, షెడ్యూల్డ్ కులములు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, రవాణా, వైద్య ఆరోగ్య, ఆర్. టి. సి., తపాలా, గ్రామీణ నీటి సరఫరా, ఖజానా శాఖల అధికారులతో వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల కొరకు 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 6 వేల 779 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.

పరీక్ష కేంద్రాలలో విద్యార్థుల కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఫర్నిచర్, ఫ్యాన్లు, వెలుతురు, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య-ఆరోగ్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్. టి. సి. అధికారులు పరీక్షా సమయం సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని, పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు. తపాల శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాలను తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

విద్యార్థులు పరీక్ష సమయం ప్రారంభానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, పరీక్షా కేంద్రంలోనికి చరవాణిలకు అనుమతి లేదని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులు వారంలోగా పరీక్షా కేంద్రాలను సందర్శించి అవసరమైన ఏర్పాట్లపై నివేదికలు రూపొందించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా ఉండేందుకు ముఖ్య పర్యవేక్షకులు ఇన్విజిలేటర్లకు శిక్షణ అందించాలన్నారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.