calender_icon.png 26 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం

26-04-2025 12:30:46 AM

ఐఈడీతో ఒకరి ఇల్లు బ్లాస్ట్, బుల్డోజర్‌తో మరొకరి నివాసం కూల్చివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాంలో ఉగ్రఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను శుక్రవా రం భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ అధికారులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. బిజ్‌బెహారాలో లష్కరే ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ నివాసాన్ని ఐఈడీతో పేల్చి వేసిన అధికారులు.. ట్రాల్‌లోని ఆసిఫ్ షేక్ ఇంటిని బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.

బైసరన్ లోయలో పాక్ ఉగ్రవాదుల జరిపిన మారణహోమాన్ని ప్లాన్ చేయడం వెనుక ఆదిల్ థోకర్ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఆదిల్ థోకర్ 2018లో చట్టబద్ధం గా పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్కడ అతడు ఉగ్రవాద శిక్షణ పొందినట్టు తెలుస్తోంది. గతేడాది తిరిగి స్వగ్రామానికి చేరుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

అయితే భద్రతా బలగాలను ట్రాప్ చేయాలని భావించిన ఆదిల్ థోక ర్ తన నివాసంలో ఐఈడీ బాంబులు పెట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో అమర్చిన ఐఈడీ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు.

అప్రమత్తమైన పోలీసులు ఇంటి నుంచి బయటకు రాగానే పేలుళ్లు సంభవించాయి. ఇక దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ. 20 లక్షలు బహుమతిగా ఇస్తామని అనంత్‌నాగ్ పోలీసులు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఎల్‌వోసీ వెంట పాక్ కాల్పులు

పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి దాయాది పాకిస్థాన్ దుశ్చర్యకు పాల్పడింది. సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి ఎల్‌వోసీ వెంట వారి పోస్టుల నుంచి కాల్పు లకు తెగబడింది. శత్రువుల దాడిని భార త ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. అర్ధరాత్రి నుంచే ఈ కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.