calender_icon.png 29 April, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల

24-04-2025 02:18:17 AM

అనంతరం నలుగురితో కూడిన ఫొటో విడుదల

ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా అనుమానం

-న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా వీరికి ఉన్నట్టు తెలుస్తోంది.

అనంతరం ఆయుధాలతో ఉన్న నలుగురు ఉగ్రవాదులతో కూడిన ఓ ఫొటోను సైతం విడుదల చేశారు. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం ఈ స్కెచ్‌లను రూపొందించారు. ఈ ఉగ్రవాదలును పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు సాగుతున్నాయి.

వీరు కశ్మీర్ విడిచి వెళ్లే అవకాశం లేదని, సమీప ప్రాంతంలోనే తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో కనీసం 5 నుంచి 6గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు సమాచారం. కాగా.. పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పాటైంది.

తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించగా, ఆ తర్వాత 6 నెలల్లోనే లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనక పాకిస్థాన్ ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని నిఘావర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించినట్టు చెబుతున్నారు.