- హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరివాడ ముత్యాలమ్మ గుడి వద్ద శనివారం చోటుచేసుకున్న లాఠీచార్జిలో గాయపడిన ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన సాయికుమార్ గౌడ్‌ను ఎంపీ ఈటల ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. హైదరాబాద్ నగరంలో అసలేం జరుగుతుందో తక్షణమే సమగ్రమైన విచారణ జరపాలని డీజీపీని కోరారు. హైదరాబాద్ అడ్డాగా ముంబాయి, ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వందల సంఖ్యలో వచ్చి ట్రైనింగ్ పేరు తో ఉగ్రవాదం, ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు.
‘మీరు కొట్టాల్సింది మమ్మల్ని కాదు.. మీరు కళ్ల చూడాల్సింది మా రక్తాన్ని కాదు’ అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందువులు, హిందూ దేవాలయాల జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేయండని పోలీసులపై మండిపడ్డారు. రెండు నెలలుగా వరుసగా ఆరు దేవాలయాలపై దాడులు జరిగినట్టు తెలిపారు. ముత్యా లమ్మ గుడి మీద దాడి జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాలని స్వయంగా తాను కోరినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు.