calender_icon.png 22 April, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ స్వయంకృతం

14-03-2025 12:00:00 AM

భారత్‌నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటినుంచి పాకిస్థాన్‌లోని ప్రభుత్వాలు మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే తమ విధానంగా చేసుకున్నాయి. ఇందుకోసం అవి ఉగ్రవాద ముఠాలను తయారు చేశాయి. అయితే ఈ కారణంగా ఆర్థికంగా చితికిపోయినా అది ఇప్పటికీ ఈ ఉగ్రవాదమే తమకు చేటుగా మారిందనే వాస్తవాన్ని గుర్తించలేకపోతోంది. పాలు పోసి పెంచిన పామే తమను కాటు వేస్తోందనే చేదు నిజాన్ని అది అంగీకరించలేకపోతోంది. చివరికి దేశం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి దాపురించింది. ఏ విధంగా చూసినా ఉగ్రవాదం పాక్‌కే ఎక్కువ నష్టం కలిగించిందనేది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వ వైఫల్యం దిశగా అది పయనిస్తోంది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా వేర్పాటువాదం పడగలు విప్పుతోంది.

ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక వివక్ష కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులు తాము దేశంనుంచి విడిపోతామని గతకొంత కాలంగా ఆందోళన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా గా బలూచిస్థాన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వాస్తవానికి బలూచిస్థాన్ రాష్ట్రాన్ని భారత్‌నుంచి విడిపోయిన ఆరునెలల తర్వాత పాక్ బలవంతంగా స్వాధీ నం చేసుకుంది. వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రమైనప్పటికీ బలూచిస్థాన్‌లో జనాభా మాత్రం తక్కువే.  ఇక్కడ  బొగ్గు, బంగారం, రాగి, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత నిరుపేద రాష్ట్రంగా ఉంది.

తమ ఖనిజ నిక్షేపాలు దోచుకుపోయి పాక్ ప్రభుత్వం దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నదనే ఆగ్రహం స్థానికుల్లో మొదటినుంచీ ఉంది. అప్పటినుంచి ఇక్కడ అనేక వేర్పాటు ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు చైనా 62 బిలియన్ డాలర్లతో చేపట్టిన భారీ ప్రాజెక్టు చైనా పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ( సీపీఈసీ)కు చెందిన ప్రధాన ఓడరేవు గ్వాడార్ కూడా ఇక్కడే ఉంది. తమకు ప్రత్యేక బలూచిస్థాన్ కావాలన్న నినాదంలో బీఎల్‌ఏ ఇంతకాలంగా పోరాటాలు చేస్తూ ఉంది. పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడ ఐదు వేర్పావాద ఉద్యమాలు జరిగాయి.

తాజాగా 2000లో తమ వనరులు తమ ప్రజలకే కావాలన్న డిమాండ్‌తో మొదలైన ఉద్యమం క్రమంగా పూర్తి స్వాతంత్య ఉద్యమంగా రూపుదిద్దుకుంది. అప్పుడే బీఎల్‌ఏ పురుడుపోసుకుంది. ప్రముఖ బలూచ్ జాతీ యవాద నాయకుడు నవాబ్ ఖైర్ బక్ష్ మార్రి కుమారుడు బాచ్ మార్రి  దీనికి నాయకత్వం వహించినట్లు చెప్తారు. 2006లో పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం మరో కీలక బలూచిస్థాన్ నేత నవాబ్ అక్బర్ బుగ్టిని హతమార్చినప్పటినుంచి ఈ తిరుగుబాటు ఉద్యమం తీవ్రమైంది.

ఏడాది తర్వాత బలాచ్ మార్రి కూడా హతమైనాడు. అయిన్పటికీ ఉద్యమం తీవ్రత మాత్రం ఆగలేదు. పాకిస్థాన్‌నుంచి పూర్తి స్వాతంత్య్రానికి కట్టుబడిన సంస్థగా ఇప్పుడు బీఎల్‌ఏ గుర్తింపు పొందింది. గత ఏడాది కాలంలో బీఎల్‌ఏ తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది.అత్యాధునిక ఆయుధాలతో150కి పైగా  దాడులు చేసింది. అందులో రైళ్లపై దాడులు కూడా ఉన్నాయి. దానికి పరాకాష్ఠే ఈ రైలు హైజాక్.

ఉగ్రవాదుల చెరనుంచి బందీలందరినీ విడుదల చేశామని, ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టామని పాక్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బీఎల్‌ఏ మాత్రం ఆ వాదనను ఖండిస్తోంది. పాక్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, యుద్ధనీతిలో భాగంగా తామే బందీలను విడుదల చేశామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా పాక్ తన పాతబుద్ధి మార్చుకోలేదు. రైలు హైజాక్ వెనుక అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం హస్తం ఉంద ని ఆరోపిస్తోంది. అంతే తప్ప సమస్య మూలాలను వెతికి పరిష్కరించే ఆలోచన మాత్రం చేయడం లేదు. పాక్ తన తప్పులకు ఎదుటి వారిని నిందించే వైఖరిని మార్చుకోనంత వరకు ప్రపంచ సమాజంలో అది ఒంటరిగా మిగిలి పోవడం ఖాయం. అంతేకాదు దేశం మరోసారి ముక్కలు కావడం తప్పదు.