వలస కార్మికులపై కాల్పులు
ఓ వైద్యుడితో పాటు
ఆరుగురు కూలీలు మృతి
జమ్ముకశ్మీర్, అక్టోబర్ 20: జమ్ముకశ్మీర్‌లో అమాయకులపై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పొట్టకూటి కోసం వచ్చిన వల స కార్మికులను బలి తీసుకున్నారు. గందర్‌బల్ జిల్లా గగన్‌గిర్‌లోని ఓ నిర్మాణ స్థలంలో ఆదివారం టెర్రరిస్టులు జరిగిన కాల్పుల్లో ఓ వైద్యుడు సహా ఆరుగురు వలస కూలీలు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న సొరంగం సమీపంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. ప్రస్తుతం భద్ర తా బలగాలు దాడి జరిగిన ప్రదేశా న్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు, సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. నిరాయుధులైన అమాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మరణించినవారికి సంతాపం తెలిపారు. మూడ్రోజుల క్రితం షోపియా న్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపేసిన తర్వాత తాజా దాడి జరిగింది.