calender_icon.png 25 October, 2024 | 5:45 AM

కశ్మీర్‌లో ఉగ్రదాడి

09-07-2024 02:33:02 AM

నలుగురు సైనికుల వీర మరణం

కథువా జిల్లాలో కాన్వాయ్‌పై ఆకస్మిక దాడి

శ్రీనగర్, జూలై 8: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. సైనిక వాహనాల కాన్వాయ్‌పై మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. కథువా జిల్లాలోని మారుమూల మచేదీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. సైనిక వాహనాల కాన్వాయ్ కథువాకు ౧౫౦ కిలోమీటర్ల దూరంలోని మచేడీ రహదారిపై వెళ్తుండగా కొండలపై నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా నలువైపుల నుంచి కాల్పులు ప్రారంభించారని సైనిక ప్రతినిధి తెలిపారు.

గాయపడ్డ సైనికులను సమీపంలో దవాఖానలకు తరలించారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లు, అత్యాధునిక తుపాకులపై సైనికులపై విరుచుకుపడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. రోజంతా భీకర కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కథువా జిల్లాలో రెండు రోజుల్లో సైన్యంపై ఉగ్రవాదులు రెండుసార్లు దాడి చేశారు. శనిఛె జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయిన విషయం తెలిసిందే. 

బయట నుంచి చూస్తే అల్మారా.. లోపల ఉగ్రస్థావరం

కుల్గామ్‌లో భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించింది. చిన్నిగామ్ ఫీసల్‌లో శని వారం నలుగురు హిజ్బు ల్ ఉగ్రవాదులను మట్టుపెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. సైనికుల అన్వేషణలో విస్తుపోయో విషయాలు బయటపడ్డాయి. ఓ ఇంట్లోకి వెళ్లి అల్మారా తెరచి చూసి అవాక్కయ్యారు. అల్మారాను తేరిపారా చూసి అది బంకర్‌లోకి వెళ్లే మార్గమని గుర్తించి నివ్వెరపోయారు. ఓ మనిషి పాక్కుంటూ వెళ్లేలా అల్మారా నుంచి సొరంగ మార్గం ఉండటాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ నేత వివేక్ సింగ్ నేతాజీ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.