calender_icon.png 31 October, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో భయానక వాతావరణం

21-07-2024 12:55:40 AM

ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు

నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు 

గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ విఫలమైందని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో వివరించినట్లు చెప్పారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్బంధం, అణిచివేత, అరెస్ట్‌లు, అక్రమ కేసులతో భయానక వాతావారణాన్ని సృష్టిస్తోందని, సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీఛార్జి, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలను, గ్రూప్ 1, 2, 3కి సంబంధించి పోస్టులు పెంచుతామన్న హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించామన్నారు. ఈ అంశంపై గవర్నర్  చాలా సీరియస్‌గా స్పందించారని, హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పినట్లు తెలిపారు.

రాష్ర్టంలో రాజ్యాంగ హననం జరుగుతోందని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగతి ఆయనకు తెలిపామన్నారు. ఈ అంశంపై  న్యాయపోరాటం చేస్తున్నామని, స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని వివరించామన్నారు. దీనిపై గవర్నర్ స్పందించి మ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని, ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తానని గవర్నర్ చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. భవిష్యత్‌లో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనను కలవాలని ఆయన తెలిపారని, తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. 

రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం 

కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సంబంధించిన గవర్నర్‌కు మాత్రమే కాదు. రాష్ర్టపతికి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ర్టంలోని నిరుద్యోగ యువతకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తుందన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని అన్న సీఎం.. ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారని ఎద్దేవా చేశారు.