calender_icon.png 25 October, 2024 | 9:50 AM

చివర దశకు టెర్మినల్ పనులు

18-09-2024 12:38:18 AM

కాప్రా, సెప్టెంబర్ 17: చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు దశాబ్దాల ఘనత ఉంది. స్టేషన్ ద్వారా నిజాంకాలం నుంచి ప్రయాణికులకు సేవలు అం దుతున్నాయి. హైదరాబాద్ మహానగరం రోజురోజకూ తన పరిధులను విస్తరిం చుకోవడం, నగర జనాభా పెరుగుతుండడం, ప్రయాణికుల ప్రయాణ అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్‌ను టెర్మినల్‌గా రూపాంతరం చేయాలని నిర్ణయించింది. రూ.430 కోట్ల నిధులతో ఇప్పటికే భవన సముదాయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, రిజర్వేషన్ బుకింగ్, రైలు టికెట్ కేంద్రాలతో ఫ్లాట్‌ఫాం నిర్మాణాలు పూర్తయ్యాయి.  ప్రస్తుతం పనులన్నీ చివరి దశకు వచ్చాయి. అతి త్వరలో టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనున్నది.

హాల్టింగ్ ట్రైయిన్లు ఇలా..

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే కాకతీయ, శబరి, పుష్పుల్, కృష్ణా ఎక్‌ప్రెస్‌లకు హాల్టింగ్ ఉంది. ఆయా రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికులు పరిశ్రమలకు వచ్చేందుకు, తిరిగి ఇంటికి వెళ్లేందుకు రైలు ప్రయాణంపైనే ఆధారపడతారు. అలాగే టెర్మినల్ ప్రారంభమైన తర్వాత శాతవా హన, శబరి ఎక్స్‌ప్రెస్‌లకు సైతం హాల్టింగ్ ఇవ్వనున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. కానీ, అందుకు తగిన విధంగా టెర్మినల్‌లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. 

మెల్లగా రోడ్డు విస్తరణ పనులు..

సికింద్రాబాద్ చర్లపల్లి ఎంఎంటీఎస్ రెండో దశ పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. వాటిని సత్వరం పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. జంట నగరాల నుంచి టెర్మినల్‌కు చేరుకునే మార్గాలను విస్తరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి టెర్మినల్‌ను సందర్శించారు. రోడ్డు మార్గాల విస్తరణ సర్వేను పరిశీలించారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆమె అదేశించారు.

విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించాలని, సికింద్రాబాద్ నుంచి మల్లాపూర్ మీదుగా టెర్మినల్‌కు వచ్చే రహదారి, అల్వాల్ నుంచి ఈసీఐఎల్ మీదుగా చక్రీపురం చర్లపల్లి పారిశ్రామికవాడ, ఈసీఐఎల్ నుంచి కేబుల్ చౌరస్తా మీదుగా చర్లపల్లి, ఘట్‌కేసర్ నుంచి రాంపెల్లి మీదుగా ఘట్‌కేసర్, ఉప్పల్  చెనిగచర్ల మీదుగా రైల్వే టెర్మినల్‌కు వచ్చే రహదారుల విస్తరణ పనులు వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నది. అధికారులు ఇప్పటికే రెండు ప్రధాన రహదారుల విస్తరణకు మహాలక్ష్మీనగర్‌లో కొందరికి  నోటీసులు ఇచ్చారు. మరోవైపు పారిశ్రామికవాడలోని ఐవోసీఎల్ సమీపంలోని అటవీశాఖ భూముల సేకరణ ప్రక్రియ కూడా వేగవంతం చేయాల్సి ఉన్నది. ఈ పనులన్నింటినీ పూర్తి చేసి టెర్మినల్ వెళ్లే ‘మార్గం’ సుగమం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.