19-03-2025 12:46:17 AM
నాగర్ కర్నూల్ మార్చి 18 విజయక్రాంతి అనుమానాస్పద స్థితిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన చాపలు శ్రీలత(16) అదే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.
కాగా తరచూ ఫోన్ మాట్లాడుతుందన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపం చెంది ఈనెల 15న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఖర్చులకు డబ్బులు అడిగినా ఇంట్లో ఇవ్వలేదని తన తోటి విద్యార్థులతో తన బాధను వ్యక్తపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో చనువుగా ఉంటూ తరచు ఫోన్ మాట్లాడేదని అందుకు ఇంట్లో త్వరగా పెళ్లి చేస్తామని చెప్పడంతోనే బాలిక మనస్థాపం చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.
దీనిపై కుటుంబ సభ్యులు తమ విద్యార్థి మృతి పట్ల అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.